మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎస్‌పి)కి సుప్రీంకోర్టులో గురువారం ఎదురుదెబ్బ తగిలింది. రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో గడియారం చిహ్నాన్ని అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపికే కేటాయిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే ఈ వివాదం కోర్టు పరిధిలో ఉందన్న విషయాన్ని బహిరంంగా తెలియ చేయడంతో పాటు తమ ఆదేశాలను అతిక్రమించబోమని హామీ ఇస్తూ నవంబర్ 4న తాజాగా అఫిడవిట్‌ను దాఖలు చేయాలని అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్‌సిపిని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఎన్నికలు ముగిసేవరకు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించబోమని హామీ ఇస్తూ తాజా అఫిడవిట్ దాఖలు చేయాలని ఇబ్బందికర పరిస్థితిని తెచ్చుకోవద్దని అజిత్ పవార్ వర్గాన్ని సుపీంకోర్టు ఆదేశించింది. తమ ఉత్తర్వులను ఉల్లంఘించడానికి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించిన పక్షంలో సుమోటోగా కోర్టు ధిక్కరణ చర్యలను చేపడతామని కూడా కోర్టు హెచ్చరించింది. ఎన్‌సిపికి చెందిన గడియారం చిహ్నాన్ని అజిత్ పవార్ వర్గం ఎన్నికలలో ఉపయోగించకుండా నిషేధించాలని కోరుతూ శరద్ పవార్ వర్గం దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది.