Sunday, January 19, 2025

నాకూ సిఎం కావాలని ఉంది

- Advertisement -
- Advertisement -

మరి కొన్ని నెలల్లో మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగనున్న తరుణంలో తన సొంత బాబాయ్ శరద్ పవార్‌పైనే తిరుగుబాటు చేసి నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి)ని చేజిక్కించుకున్న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మొట్టమొదటిసారి తన మనసులో మాటను బయటపెట్టారు. తనకు కూడా ముఖ్యమంత్రి పదవిపైన మక్కువ ఉందని వెల్ల డించారు. మంగళవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమ నాయకుడు ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారని, ఈ జాబితాలో తాను కూడా ఉంటానని ఆయన అన్నారు. అయితే ముఖ్యమంత్రి కావాలంటే మెజారిటీ సభ్యుల బలం ఉండాలని, ఈ విషయంలో ప్రతి ఒక్కరి ఆశ నెరవేరదని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరికి అభిప్రాయాలు, ఆశలు ఉంటాయని, కాని కోరుకున్నవన్నీ అందరికీ దక్కవని ఆయన చెప్పారు.

అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు ఆయుధంతో ఓటర్లే దీన్ని నిర్ణయిస్తారని, 288 మంది సభ్యులతో కూడిన మహారాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ సాధించాలంటే 145 సీట్లు రావాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. కాగా..బిజెపి, ఎన్‌సిపి, శివసేనతో కూడిన మహాయుతి కూటమి రానున్న అసెంబ్లీ ఎన్నికలను ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలో ఎదుర్కొంటుందని ఆయన స్పష్టం చేశారు. మళ్లీ తమ కూటమి అధికారంలోకి రావడానికి తామంతా శ్రమిస్తున్నామని, తమ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తాము కూర్చుని ముఖ్యమంత్రి గురించి నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే కొనసాగాలని శివసేన నాయకులు డిమాండు చేస్తున్న నేపథ్యంలో అజిత్ పవార్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మరోపక్క బిజెపి నాయకులు సైతం తమ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తదుపరి ముఖ్యమంత్రి కావాలని కోరుతుండడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News