Sunday, December 22, 2024

‘మహా’వ’వార్’..

- Advertisement -
- Advertisement -

ముంబయి: మహారాష్ట్రలో ఆదివారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్న నేషనలిస్టు కాంగ్రెస్ పారీ ్ట(ఎన్‌సిపి) కీలక నేత అజిత్‌పవార్ తన మద్దతుదారులతో కలిసి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని అధికార కూటమిలో చేరారు. ముఖ్యమంత్రి ఫిండేతో భేటీ అనంతరం అజిత్ పవార్ తన మద్దతుదారులతో కలిసి గవర్నర్‌ను కలిశారు. ఆ వెనువెంటనే మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఆయనతో పాటు మరో ఎనిమిది మంది ఛగన్ భుజ్‌బల్, దిలీప్ వాల్సే పాటిల్ హసన్ ముష్రిఫ్, ధనంజయ్ ముండే, అదితి తట్కరే, ధర్మారావు అట్రమ్, అనిల్ పాటిల్, సంజయ్ బన్సోడే కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రమేశ్ భైస్ వీరి చేత ప్రమాణం చేయించారు. కాగా శరద్ పవార్‌కు గట్టి మద్దతుదారులుగా భావిస్తున్న ఛగన్ భుజ్‌బల్, వాల్సేపాటిల్‌లు కూడా మంత్రులుగా ప్రమాణం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

దీంతో అజిత్ పవార్‌పై ఇన్నాళ్లుగా ఉన్న అనుమానాలు ఇప్పుడు నిజమైనాయి. అంతకు ముందు పార్టీ ఎంఎల్‌ఎలు, నేతలతో అజిత్‌పవార్ తన నివాసం దేవగిరిలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో శరద్‌పవార్ కుమార్తె సుప్రియా సూలే సహా పలువురు ఎన్‌సిపి నేతలు హాజరయ్యారు. అయితే ఈ సమావేశంనుంచి సూలే అర్ధంతరంగా బైటికి వెళ్లిపోయారు. అనంతరం అజిత్ పవార్ రాజ్‌భవన్‌కు తరలి వెళ్లగా ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే అజిత్ పవార్‌కు ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టే అవకావాలున్నాయంటూ వార్తలు వచ్చాయి. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదానుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు అజిత్‌పవార్ ప్రకటించిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. అయితే అజిత్ పవార్ నివాసంలో ఎన్‌సిపి నేతల సమావేశం గురించి తనకు తెలియదని పుణెలో ఉన్న శరద్‌పవార్ చెప్పడం గమనార్హం. పాట్నాలో ఇటీవల జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో శరద్‌పవార్‌తో పాటుగా ఆయన కుమార్తె, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే పాల్గొనడం అజిత్‌పవార్, ఆయన మద్దతుదారులకు ఆగ్రహం తెప్పించిందని, దాని ఫలితమే ఈరోజు పరిణామాలని అజిత్ పవార్ సన్నిహిత వర్గాలు తెలియజేశాయి.

ఎన్‌సిపిలోని మొత్తం 53 మంది ఎంఎల్‌ఎలలో 40 మంది ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారని మహారాష్ట్ర బిజెపి అధ్యక్షుడు చంద్రశేఖర్ బవన్‌కులే చెప్పారు. ఏడాది క్రితం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో అప్పటి ఉమ్మడి శివసేనలో తిరుగుబాటు చోటు చేసుకోవడంతో ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి( ఎంవిఎ) ప్రభుత్వం కూలిపోయిన విషయం తెలిసిందే. 2022 జూన్ 30న షిండే ముఖ్యమంత్రిగా బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవిస్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం తెలిసిందే. ఇప్పుడు అజిత్ పవార్ కారణంగా ఎన్‌సిపిలో తిరుగుబాటు చోటు చేసుకోవడం గమనార్హం. ఏడాదిలో రెండు పెద్ద పార్టీలను చీల్చిన ఘనత బిజెపికి దక్కింది.

మాదే అసలైన ఎన్‌సిపి ఈ గుర్తుతోనే భవిష్యత్తు ఎన్నికల్లో పోటీ చేస్తాం: అజిత్ పవార్
నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీనుంచి దాదాపు 40 మంది ఎంఎల్‌ఎలను తీసుకుని అధికార బిజెపిశివసేన కూటమి ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్ మరో బాంబు పేల్చారు. ఎన్‌సిపి గుర్తు, పార్టీ తమవేనని ప్రకటించుకున్నారు. ఒక పార్టీగానే తాను, ఇతర ఎన్‌సిపి ఎంఎల్‌ఎలు మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరామని, ఎన్‌సిపి గుర్తుపైనే భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికల్లోను పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ అజిత్ పవార్ తాజా వ్యాఖ్యలు చేశారు. ‘భారతీయ జనతా పార్టీతో కలిసి అధికారాన్ని పంచుకోవాలన్న తన నిర్ణయాన్ని అజిత్ పవార్ సమర్థించుకుంటూ, ‘శివసేనతో కలిసి వెళ్లినప్పుడు బిజెపితో కలిసి వెళ్లడంలో తప్పేముంది?నాగాలాండ్‌లోనూ ఇదే జరిగింది’ అని అన్నారు. దేశాభివృద్ధి కోసమే తాము షిండే ప్రభుత్వంలో చేరాలని నిర్ణయించుకున్నామని చెప్పిన ఆయన ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News