న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈమేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఆయన లేఖ రాశారు. ఆంటోనీ రాజ్యసభ పదవీకాలం ఏప్రిల్ 2 తో ముగుస్తుంది. ఆ తరువాత తాను రాజకీయాల్లో ఉండబోనని, ఏ ఎన్నికల్లో పోటీ చేయనని, ఆంటోనీ ప్రకటించారు. గత 52 ఏళ్లుగా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర వహించే ఆంటోనీ కేరళ సిఎంగా, కేంద్ర మంత్రిగా కూడా పదవులు నిర్వహించారు. విద్యార్థి నాయకుడిగా ఎదిగిన ఆంటోనీ మొట్టమొదటిసారి 1976 లో ఎంఎల్‌ఎ అయ్యారు. 37 ఏళ్ల వయసు లోనే కేరళ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పటివరకు కేరళ సిఎంగా మూడుసార్లు, అలాగే కేంద్ర మంత్రిగా మూడుసార్లు పదవుల్లో రాణించారు.
ఐదుసార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్లమెంటరీ కమిటీకి ఛైర్మన్‌గా, సేవలందించారు. రాజకీయాలకు దూరంగా ఉండాలన్న తన నిర్ణయం చాలా రోజుల కిందటే తీసుకున్నారు. సోనియాకు, కేరళ లోని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జికి , ఇతర నేతలకు తన నిర్ణయాన్ని తెలియచేశారు. కాంగ్రెస్‌లో విశ్వసనీయమైన నేతగా గుర్తింపు పొందిన ఆంటోనీ ఇందిరాగాంధీ, రాజీవ్ గాందీ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసి మన్ననలందుకున్నారు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరం కావడం కాంగ్రెస్‌పార్టీకి పెద్దదిక్కు కోల్పోయినట్టేనని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. త్వరలో ఆయన ఢిల్లీ నుంచి కేరళ లోని తిరువనంతపురం వెళ్లనున్నారు.