Saturday, November 23, 2024

బిజెపిలో చేరి నా కుమారుడు తప్పుచేశాడు: ఎకె ఆంటోని

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్: భారతీయ జనతా పార్టీలో చేరాలని తన కుమారుడుఅనిల్ కె ఆంటోని తీసుకున్న నిర్ణయం తనను తీవ్రంగా బాధించిందని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎకె ఆంటోని తెలిపారు. ఇప్పుడు తన వయసు 82 సంవత్సరాలని, జీవిత చరమాంకంలో ఉన్నానని, తనతుది శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా కొనసాగుతానని ఆంటోని స్పష్టం చేశారు. గురువారం న్యూఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇంకా ఎంతకాలం జీవిస్తానో తెలియదని, ఎక్కువ కాలం జీవించాలని కూడా కోరుకోవడం లేదని, అయితే బతికున్నంతవరకు నెహ్రూ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉంటానని భావోద్వేగంతో ఆయన అన్నారు.

తన కుమారుడు తీసుకున్న నిర్ణయం తప్పని ఆయన చెప్పారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశ సమైక్యతకు, భిన్నత్వానికి, లౌకికవాదానికి ముప్పు తీసుకువస్తోందని ఆయన చెప్పారు. మన దేశ సమైక్యత దాని భిన్నత్వంలో, లౌకికవాదంలో ఇమిడి ఉందని ఆయన చెప్పారు. 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పి నుండి ఈ విలువలను నాశనం చేయడానికి అనేక ప్రయత్నాలు జరిగాయని ఆయన ఆరోపించారు. దేశాన్ని నియంతృత్వంలోకి నరేంద్ర మోడీ ప్రభుత్వం మార్చివేసిందని ఆయన ఆరోపించారు. దేశ సమైక్యత బలహీనపడిందని ఆయన అన్నారు. తన కుమారుడు అనిల్ తీసుకున్న నిర్ణయాన్ని పరిణతి లేని నిర్ణయంగా ఆయన అభివర్ణించారు.

బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ తప్పుడు సిద్ధాంతాలపై తన గళాన్ని వినిపిస్తూనే ఉంటానని ఆంటోని స్పష్టం చేశారు. కులం, మతం, జాతి, భాషలకు అతీతంగా సమానత్వం కోసం నెహ్రూ కుటుంబం నిలబడిందని ఆయన అన్నారు. ఇప్పటికి దేశాన్ని పరిరక్షించేందుకు ఆ కుటుంబం పోరాడుతోందని ఆయన చెప్పారు. తాను ఇందిరా గాంధీ నుంచి ఒకసారి దూరమైనప్పటికీ తిరిగి వచ్చిన తర్వాత తాను ఆ కుటుంబానికి మరింత చేరువయ్యానని ఆయన చెప్పారు. తన తుది శ్వాస వరకు కాంగ్రెస్ సభ్యుడిగానే కొనసాగుతానని ఆయన పునరుద్ఘాటించారు. తన కుమారుడు అనిల్ గురించి ఇదే తాను మాట్లాడే చివరి మాటలని, తన కుమారుడి నిర్ణయంపై ఇదే తన చివరి స్పందన కూడానని ఆంటోని చెప్పారు. ఆంటోని కుమారుడు అనిల్ కె ఆంటోని గురువారం బిజెపిలో చేరారు. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా సెల్ చైర్మన్ పదవికి, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభత్వానికి జనవరిలో ఆయన రాజీనామా చేశారు. ప్రధాని నరేంద్ర మోడీపై బిబిసి ప్రసారం చేసిన డాక్యుమెంటరీపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ ఆయన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News