న్యూఢిల్లీ: మూడు నల్ల సేద్యపు చట్టాలు రద్దు చేయాలంటూ రైతులు ఎన్నో నెలలుగా ఢిల్లీలో నిరసనలు తెలుపుతున్నారు. అయితే వారికి మద్దతుగా శుక్రవారం ర్యాలీ నిర్వహించినందుకు గాను శిరోమణి అకాలీదళ్ పార్టీ అధినేత సుఖ్‌బీర్‌సింగ్ బాదల్, ఆ పార్టీ మహిళా నేత హర్‌సిమ్రత్ కౌర్ సహా 11 మందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ర్యాలీ నిర్వహించినందుకగాను వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన శిరోమణి అకాలీదళ్ నేతలను సన్సద్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం దొడ్డి దారిన గత ఏడాది నవంబర్ 26న తెచ్చిన మూడు సేద్యపు చట్టాలు శుక్రవారం నాటికి ఏడాది పూర్తిచేసుకున్నందున సెప్టెంబర్ 17వ తేదీని శిరోమణి అకాలీదళ్ పార్టీ ‘కాలా దివస్’(బ్లాక్ డే)గా ప్రకటించి ర్యాలీని నిర్వహించింది. ఢిల్లీలోని గురుద్వారా తలాబ్‌గంజ్ సాహిబ్ నుండి పార్లమెంట్ వరకు ర్యాలీ నిర్వహించాలని రైతులకు, పార్టీ కార్యకర్తలకు సుఖ్‌బీర్‌సింగ్ బాదల్ పిలుపునిచ్చారు. మూడు నల్ల సేద్యపు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీలో పాల్గొనాలని వారందరిని ఆయన కోరారు. ర్యాలీకి అనుమతులు లేవని పోలీసులు ఆక్షేపణ తెలుపడంతో నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చివరికి 11 మంది అరెస్టు చేశారు. వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి పదవికి హర్‌సిమ్రత్ బాదల్ ఇదివరలోనే రాజీనామా చేసిన విషయం ఇక్కడ గమనార్హం.