వారణాసి నుంచి ముంబైకి 172 మంది ప్రయాణికులతో వెళుతున్న ఆకాశ ఎయిర్‌కు చెందిన విమానం ఒక ప్రయాణికుడు అస్వస్థతకు లోనుకావడంతో భోపాల్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఆకాశ ఎయిర్ ఓపి 1524 విమానం గురువారం వారణాసి నుంచి ముంబైకి బయల్దేరగా విమానంలోని ఒక ప్రయాణికుడు అస్వస్థత చెందినట్లు ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది. క్యాబిన్ సిబ్బంది, విమానంలో ప్రయాణిస్తున్న ఒక డాక్టరు ఆ వ్యక్తికి తక్షణ చికిత్స అందచేసినట్లు తెలిపింది.
అయితే దురదృష్టవశాత్తు ఆ ప్రయాణికుడు మరణించినట్లు ఎయిర్‌లైన్ తెలిపింది. అస్వస్థతకు లోనైన ప్రయాణికుడి గురించి విమాన పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు తెలియచేసి ఉదయం 11.40 గంటలకు భోపాల్‌లోని రాజా భోజ్ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు ఎయిర్‌లైన్ తెలిపింది. వెంటనే ఆ ప్రయాణికుడిని ఆసుపత్రికి తరలించగా అక్కడ మరణించినట్లు ఆకాశ ఎయిర్ తెలిపింది. అవసరమైన లాంఛనాలను పూర్తి చేసుకుని సాయంత్రం 5 గంటలకు విమానం ముంబైకి బయల్దేరినట్లు తెలిపింది.