అఖిల్ గొగోయ్ అపూర్వ విజయం
శివ్‌సాగర్(అస్సాం): జైలులో ఉండి, ఎటువంటి ప్రచారం చేయకుండా విజయం సాధించిన తొలి అస్సామీగా సిఎఎ వ్యతిరేక ఆందోళనకారుడు అఖిల్ గొగోయ్ చరిత్ర సృష్టించారు. శివసాగర్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన అఖిల్ తన సమీప బిజెపి ప్రత్యర్థి సురభి రాజ్‌కొన్వరిపై 11,875 ఓట్ల ఆధిక్యంతో ఘనవిజయం సాధించారు. సిఎఎకి వ్యతిరేకంగా రాయ్‌జోర్ దళ్‌ను స్థాపించిన అఖిల్ గొగోయ్‌ను 2019 డిసెంబర్‌లో ప్రభుత్వం దేశద్రోహం ఆరోపణలపై అరెస్టు చేసింది. స్వతంత్ర అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేసిన అఖిల్‌కు 57,219 ఓట్లు రాగా 46.06 శాతం ఓట్లతో ఓటర్లు తమ మద్దతు తెలిపారు. మొదట్లో అఖిల్‌ను బలపరిచిన కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషంలో సుభ్రమిత్ర గొగోయ్‌ను బరిలో నిలిపి ఫలితాలలో మూడవ స్థానానికి పడిపోయింది.
జైలులో ఉండే ప్రజలకు అనక బహిరంగ లేఖలు రాసిన అఖిల్ గొగోయ్ తాము పోరాడవలసిన సమస్యలను ప్రస్తావించారు. అయితే.. అన్నిటికన్నా ఓటర్లను ప్రభావితం చేసింది.. 85 సంవత్సరాల వృద్ధాప్యంలో కూడా అఖిల్ గొగోయ్ తల్లి ప్రియద గొగోయ్ శివ్‌సాగర్‌లోని ఇరుకు సందులలో తన కుమారుడి తరఫున ప్రచారం చేయడం. ఆ వృద్ధమాత పట్టుదలను చూసి చలించిపోయిన ప్రముఖ సామాజిక కార్యకర్తలు మేథా పాట్కర్, సందీప్ పాండే తదితరులు ఎక్కడెక్కడి నుంచో అస్సాం చేరుకుని ఆమెకు బాసటగా నిలబడి ప్రచారంలో పాల్గొన్నారు. రాయ్‌జోర్ దళ్‌కు చెందిన వందలాదిమంది యువ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. యావత్ ఎన్నికల యంత్రాంగాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న బిజెపి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వంటి అగ్రనాయకులను ప్రచారంలోకి దింపినప్పటికీ అఖిల్ గొగోయ్ విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోవడం విశేషం.