Sunday, December 22, 2024

యోగీని తిరిగి గోరఖ్‌పూర్‌కు పంపలేక పోయిన అఖిలేశ్

- Advertisement -
- Advertisement -
Akhilesh could not send Yogi back to Gorakhpur
ఎన్నో ఎత్తుగడలతో కొనసాగిన ఒంటరి పోరాటం…

లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ అధినేత 48 ఏళ్ల అఖిలేశ్ యాదవ్ ఎన్నికల రంగంలో ఎంతగట్టిగా పోరాడినప్పటికీ తన సమీప బిజెపి అభ్యర్థి ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ను తిరిగి గోరఖ్‌పూర్‌కు పంపాలనుకున్న ఆయన ప్రయత్నం నెరవేరలేదు సరికదా మరో ఐదేళ్లు బిజెపి పాలనకు అవకాశం కలిగించింది. ఈ ఎన్నికల్లో ప్రచారానికి ప్రముఖులను బిజెపి రంగం లోకి దించగా, అఖిలేశ్ మాత్రం ఏ ప్రముఖుల సాయం లేకుండా ఒంటరిగానే ప్రచారం సాగించారు. అంతేకాదు అభ్యర్థులకు పార్టీ టికెట్ల కేటాయింపు నుంచి మిత్రపక్షాలతో పొత్తు వరకు వన్‌మేన్‌షో అయింది. 2017 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకుని సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ చేతులు కాల్చుకున్నారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో మాయావతి నేతృత్వం లోని బహుజన్‌సమాజ్ పార్టీతో పాలుపంచుకున్నా ఫలితం లేక పోయింది. అందువల్ల గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చిన్నచిన్నప్రాంతీయ పార్టీలతోనే పొత్తు కుదుర్చుకున్నారు.

తమవైపు ఒబిసి వర్గాల మద్దతు కూడగట్టుకోడానికి బిజెపిని చిత్తు చేయడానికి వీలుగా మంత్రులు స్వామి ప్రదేశ్ మౌర్య, దారాసింగ్ చౌహాన్, ధరమ్‌సింగ్ సైని వంటి ఒబిసి వర్గం వారిని చేర్చుకున్నా ఆశించిన ఫలితం నెరవేరలేదు. అఖిలేశ్ రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన దగ్గర నుంచీ ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటూ వస్తున్నారు. మొదట్లో సమాజ్‌వాది సంస్థాపక అధ్యక్షులు, తన తండ్రి మూలాయం సింగ్ యాదవ్‌తోనే సంఘర్షించవలసి వచ్చింది. డిపి యాదవ్, అమర్‌సింగ్, ఆజం ఖాన్ వంటి తన తండ్రి బంధువులు, స్నేహితులతో వారసత్వ రాజకీయ విభేదాలు తలెత్తాయి. తన పినతండ్రి శివ్‌పాల్ యాదవ్ మాఫియా డాన్ ముఖ్తర్ అన్సారీని పార్టీ లోకి తీసుకురావడం అఖిలేశ్ వ్యతిరేకించారు. మొదట పార్టీ యువజన విభాగం అధ్యక్షుడుగా పదవిని నిర్వహించాక , 2012 లో తన తండ్రి దీవెనల తోనే పార్టీ అధ్యక్షుడు అయ్యారు. 38 ఏళ్ల వయసులోనే ముఖ్యమంత్రి అయిన కీర్తి వహించారు. 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనూహ్యంగా ఒక తిరుగుబాటు వర్గాన్ని ప్రతిఘటించవలసి వచ్చింది.

దాంతో తన తండ్రి మూలాయం సింగ్ యాదవ్‌ను రాష్ట్ర బాధ్యతల నుంచి తప్పించి జాతీయ అధ్యక్ష పదవికే పరిమితం చేశారు. ఒకప్పుడు తాను వ్యతిరేకించిన చిన్నాన్న శివ్‌పాల్ సింగ్ యాదవ్‌ను మళ్లీ ఇప్పటి ఎన్నికల సమయాన దగ్గరకు చేర్చుకుని రాజకీయ ఎత్తుగడలు వేశారు. గతంలో అఖిలేశ్ ప్రభుత్వం ఆగ్రాలక్నో ఎక్స్‌ప్రెస్‌వే, మెట్రోరైలు, అంతర్జాతీయ స్టేడియం, లక్నో క్యాన్సర్ ఆస్పత్రి వంటి ప్రాజెక్టులు చేపట్టి పేరు గడించింది. ఎస్‌పిలో కొత్తగాలి… కొత్త ఎస్‌పి అన్న నినాదంతో ఈసారి ఎన్నికల రంగం లోకి ఆయన దిగారు. 1973 జులై 1న సైఫైలో జన్మించిన అఖిలేశ్ రాజస్థాన్ ధోల్‌పూర్‌లో మిలిటరీ స్కూలులో చదువుకున్నారు. జెఎస్‌ఎస్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్శిటీ నుంచి సివిల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ లో బాచిలర్, మాస్టర్ డిగ్రీలు పొందారు. డింపిల్ యాదవ్‌ను పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కుమార్తెలు , కుమారుడు ఉన్నారు. 2000 లో రాజకీయాల్లోకి ప్రవేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News