సమాజ్‌వాది పార్టీలో మళ్లీ అసమ్మతి
లక్నో: సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌పై ప్రస్తుతం జైలులో ఉన్న ఆ పార్టీ నాయకుడు ఆజమ్ ఖాన్ మీడియా ఇన్‌చార్జ్ ఫసహత్ అలీ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. సమాజ్‌వాది పార్టీ సీనియర్ నాయకుడైన ఆజమ్ ఖాన్‌ను అఖిలేష్ యాదవ్ పట్టించుకోవడంలేదని, గత రెండున్నరేళ్లలో ఆయనను జైలులో ఒకే ఒక్కసారి కలుసుకున్నారే తప్ప ఆయన విడుదల కోసం ఎటువంటి ప్రయత్నాలు చేయలేయలేదని ఖాన్ విమర్శించారు. ఖాన్ అరెస్టుకు నిరసనగా ఒక్క జిల్లాలో కూడా పార్టీ కార్యక్రమం చేపట్టలేదని ఆయన అన్నారు.
అఖిలేష్ నాయకత్వంలోని సమాజ్‌వాది పార్టీకి ముస్లింలు పెద్ద సంఖ్యలో ఓటు వేసినప్పటికీ ఆ మతానికి అనుకూలంగా అఖిలేష్ ఏనాడూ ఒక్కముక్క మాట్లాడలేదని ఖాన్ ఆరోపించడంతో పార్టీలో మళ్లీ అసమ్మతి చిచ్చు రేగే అవకాశం కనపడుతోంది. ఆదివారం రాంపూర్‌లో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఖాన్ మాట్లాడుతూ అఖిలేష్ ప్రవర్తన తనను వ్యక్తిగతంగా చాలా బాధిస్తోందని, ఒక నిర్ణయం తీసుకోవలసిన సమయం వచ్చిందని ఆజమ్ ఖాన్‌కు తాను తెలియచేస్తానని ఆయన తెలిపారు.