లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో తమ పార్టీ అధికారం చేపడ్తే యువకులు, విద్యార్థులకు నాణ్యమైన ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేస్తామని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్ హామీ ఇచ్చారు. ఇప్పటికే రైతులకు 300 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందిస్తామని అఖిలేశ్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం యుపిలో అధికారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇప్పటికే యువకులకు స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు పంపిణీ చేసింది. జిఎస్‌టి, ఆదాయం పన్నుశాఖ అధికారులు ఇటీవల సోదాలు నిర్వహించిన అత్తర్ వ్యాపారికి తనతో లింక్‌లున్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగిస్తున్న బిజెపి మీడియాసెల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అఖిలేశ్ తెలిపారు. ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ఆ వ్యాపారి తన పక్కన ఉన్నట్టు ఫోటోను సృష్టించి ప్రచారం సాగిస్తున్నారని అఖిలేశ్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై తప్పుడు ప్రచారం సాగిస్తున్న బిజెపి ఐటిసెల్ ఇంచార్జ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని తన పార్టీ లీగల్‌సెల్‌కు సూచించానని ఆయన తెలిపారు.