ఎస్‌పి అఖిలేష్‌కు విషం భయం
లక్నో : పోలీసు టీ తాగడానికి ఎస్‌పి నేత అఖిలేష్ యాదవ్ తిరస్కరించారు. లక్నోలోని ఉత్తరప్రదేశ్ పోలీసు ప్రధాన కార్యాలయానికి ఆదివారం యాదవ్ వెళ్లారు. తమ పార్టీ కార్యకర్త మనీష్ జగన్ అగర్వాల్ అరెస్టుపై నిలదీసేందుకు అక్కడికి వెళ్లిన ఈ మాజీ సిఎంకు పోలీసు అధికారులు మర్యాదల క్రమంలో టీ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అయితే తాను ఈ టీ తాగనని, ఏమో ఇందులో విషం కలుపుతారమో చెప్పలేనని వ్యాఖ్యానించారు. బయట వందలాది మంది ఎస్‌పి కార్యకర్తలు లోపల ఎస్‌పి నేత ఉన్నప్పుడు టీ కప్పుపై తుపాన్ చెలరేగింది.
ఛాయ్ అంటే తనకు ఇష్టం కానీ పోలీసు కార్యాలయపు టీ తాగనని తేల్చిచెప్పారు. ఇది జోక్‌గా సాగిన షాక్ అయింది. బయట ఉన్న కార్యకర్తను పిలిపించి బయట టీ కొట్టు నుంచి టీ తీసుకురావాలని కూడా చెప్పి ఆ టీ తాగి బయటకు వెళ్లారు. తాను డిజిపి కార్యాలయానికి వెళ్లినప్పుడు లోపల ఎవరూ లేరని, ఇది రాష్ట్ర పోలీసు పరిస్థితి అని వ్యాఖ్యానించారు. దీనిపై అదనపు డిజి ప్రశాంత్ కుమార్ స్పందిస్తూ ఆదివారం కావడం వల్ల అధికారులు లేరని అయినా అక్కడున్న పోలీసు అధికారి ఆయనతో మాట్లాడారని, టీ కూడా ఇచ్చారని తరువాత ఆయన టీ మాటలు ఏమిటనేది అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు.