లక్నో: వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని ఓడించాలంటే విపక్షాలు ఐక్యంగా పోరాడడమొక్కటే మార్గమని సమాజ్‌వాది పార్టీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఐక్య ప్రతిపక్ష కూటమిపై తమ పార్టీ దృక్కోణాన్ని వివరిస్తూ, 80మందిని ఓడించండి, బిజెపిని తరిమి కొట్టండి అని నినదించారు. 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి దారుణ పరాజయం తప్పదని బిసిలు, దళితులు, మైనారిటీలే బిజెపిని ఓడిస్తారని అఖిలేశ్ అన్నారు.‘ఈ సారి బిజెపిని ఓడించడానికి మా దగ్గర ఓ ఫార్ములా ఉంది. ఐక్య ప్రతిపక్ష కూటమిలోని పెద్ద జాతీయ పార్టీలు గనుక మాకు మద్దతు ఇస్తే 80మంది బిజెపి ఎంపిలను ఓడిస్తాం.
బిజెపిని తరిమి కొడతాం. అందుకే యుపిలో ‘ 80 మందిని ఓడిద్దాం, బిజెపిని తరిమేద్దాం’ అన్న నినాదంతో ఎన్నికలకు సిద్ధమవుతున్నాం’ అని చెప్పారు. ఏ రాష్ట్రంలో ఏ కూటమి భాగస్వామి బలంగా ఉందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సీట్ల పంపిణీ ఉండాలని తాను మొదటినుంచీ చెప్తున్నానని అఖిలేశ్ అన్నారు. సమాజ్‌వాది పార్టీ గతంలో రాష్ట్ర, జాతీయ ఎన్నికల్లో కాంగ్రెస్, మాయావతి పార్టీ బిఎస్‌పితో పొత్తు పెట్టుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ. సమాజ్‌వాది పార్టీ ఎప్పుడూ నిజాయితీ అయిన, భాగస్వామ్య పక్షాలతో సర్దుబాటు చేసుకునే పార్టీగానే ఉంటోందని చెప్పారు.