ఉన్నావో: తమ పార్టీకి కాన్పూర్ వ్యాపారి పీయూష్‌జైన్‌తో లింక్‌లున్నాయన్న ఆరోపణలను ఎస్‌పి అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్ ఖండించారు. ఆ వ్యాపారి కాల్ డేటా రికార్డులను(సిడిఆర్‌ను) పరిశీలిస్తే పలువురు బిజెపి నేతల పేర్లు బయటకొస్తాయని అఖిలేశ్ అన్నారు. పొరపాటున బిజెపి నేతలు తమ సొంత వ్యాపారిపైనే దాడులు చేయించారని అఖిలేశ్ అన్నారు. మంగళవారం ఉన్నావోలో సమాజ్‌వాదీ రథయాత్రను ప్రారంభించిన సందర్భంగా అఖిలేశ్ ప్రసంగించారు. ఎస్‌పి నేత పుష్పరాజ్‌జైన్‌పై ఉద్దేశించిన దాడుల్ని పొరపాటున పీయూష్‌జైన్‌పై చేయించారని అఖిలేశ్ ఎద్దేవా చేశారు. సమాజ్‌వాదీ పార్టీ ఆవిష్కరించిన అత్తర్ ఎస్‌పి ఎంఎల్‌సి పుష్పరాజ్‌జైన్‌కు సంబంధించిందని, పీయూష్‌జైన్‌ది కాదని అఖిలేశ్ తెలిపారు. టివి ఛానళ్లు కూడా మొదట పొరపడి ఎస్‌పి నేత ఇంట్లో సోదాలు జరిగాయంటూ ఫ్లాష్ న్యూస్ ప్రసారం చేశాయని, సాయంత్రానికి వాస్తవం గ్రహించాయని అఖిలేశ్ వివరణ ఇచ్చారు. కాన్పూర్ వ్యాపారవేత్త వద్ద పెద్దమొత్తంలో నగదు బయటపడటం ద్వారా మోడీ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన జిఎస్‌టి, నోట్లరద్దు విఫలమయ్యాయని తేలిందని అఖిలేశ్ విమర్శించారు.