మేము 300కుపైగా సీట్లు మాకే: అఖిలేశ్
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో బిజెపికే గెలిచే అవకాశాలెక్కువ అంటూ చూయిస్తున్న ప్రీపోల్ సర్వేను సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సోమవారం కొట్టిపారేశారు. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడ్డంతో బిజెపి తుడిచపెట్టుకుపోతుంది అన్నారు.‘వారెలా చూయించాలనుకుంటున్నారో చూయించనివ్వండి. మేము మెజార్టీతో గెలువబోతున్నాము’ అని ఆయన అన్నారు. కొన్ని టివి ఛానెళ్ల జోస్యాలను ఆయన కొట్టిపారేశారు. అఖిలేశ్ యాదవ్ పిటిఐ వార్తా సంస్థతో ఎగ్జిట్ పోల్స్ కన్నా ముందే మాట్లాడారు. సమాజ్‌వాదీ పార్టీ కూటమి ఉత్తర్‌ప్రదేశ్‌లో 300కు పైగా సీట్లు గెలుచుకుని తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందన్నారు. అధికారంలో ఉన్న బిజెపి ‘అబద్ధాల, బూటకపు డేటాను ప్రెజెంట్ చేస్తోంది’ అని విమర్శించారు.
‘కుటుంబ పాలన’(పరివార్‌వాద్)పై బిజెపి చేసిన విమర్శను తిప్పికొడుతూ బిజెపిలోనే అది ఎక్కువగా ఉంది అన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అంకుల్ గోరఖ్‌నాథ్ మఠంలో భాగం అయి ఉండకపోతే రాజకీయాలలోకి యోగి వచ్చే అవకాశం దక్కేదే కాదని అఖిలేశ్ విమర్శించారు. రాజకీయ వంశపాలనకు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సిందియా ఉదాహరణ అన్నారు. పరోక్షంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్‌ల గురించి ప్రస్తావిస్తూ వారి పిల్లలు రాజకీయాల్లోకి వచ్చారన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై దాడిచేస్తూ ‘ఆయన కుమారుడు బిసిసిఐలో ఉన్నారు. అసలతడికి ఉన్న అర్హత ఏమిటి?’ అని ప్రశ్నించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి విషయాల్లో బిజెపి ప్రజలకు అబద్ధాలు చెబుతోందన్నారు.