పార్టీ ప్రక్షాళనకు అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ చర్యలు
లక్నో : రెండు లోక్‌సభ స్థానాల ఉపఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ ఓటమి చెందిన నేపథ్యంలో సమాజ్‌వాదీ జాతీయ, రాష్ట్ర, జిల్లా అధ్యక్షులను, తొలగించడమే కాకుండా, ఆయా కార్యవర్గ విభాగాలను, యువజన, మహిళా విభాగాలను సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆదివారం రద్దు చేశారు. దీనికి కారణమేమిటో ఆ పార్టీ వెల్లడించలేదు. అజంగఢ్, రామ్‌పూర్ లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఘోరపరాజయం చవి చూడడంతో పార్టీని ప్రక్షాళన చేసే ప్రయత్నంగా తెలుస్తోంది. అయితే సమాజ్‌వాది ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడు నరేష్ ఉత్తమ్ పై మాత్రం వేటు పడలేదు. ఆయన ఆ పదవిలోనే కొనసాగుతారు. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం బిజెపిని పూర్తి శక్తితో ఎదుర్కోడానికి సమాయత్తం అయ్యేందుకే ఈ చర్యలు తీసుకున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిపై బిజెపి స్పందిస్తూ ఇది ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని పేర్కొంది. 2014,2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ , 2017,2022 అసెంబ్లీ ఎన్నికల్లోనూ సమాజ్‌వాదీ అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలో ఘోర పరాజయం పాలైందని, దీనికి యాదవ్ బాధ్యత వహించాలని, ఎందుకు ఓడిపోయారో ప్రజలకు చెప్పాలని బిజెపి అధికార ప్రతినిధి రాకేష్ త్రిపాఠీ వ్యాఖ్యానించారు.