కర్హాల్ నుంచి అఖిలేష్ నామినేషన్
లక్నో: సమజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సోమవారం తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర్ ప్రదేశ్‌లోని మెయిన్‌పురి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని కర్హాల్ అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేస్తూ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చే శతాబ్దం కోసం దేశ చరిత్రను లఖిస్తాయని అన్నారు. ప్రగతిశీల ఆలోచనలతో సానుకూల రాజకీయాలు సాగించడమే తన లక్షమని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతికూల రాజకీయ శక్తులను ఓడించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అంతకుముందు తన స్వస్థలం ఎటావాలోని సైఫై నుంచి నామినేషన్ దాఖలు చేయడానికి విజయ రథ బస్సులో మెయిన్‌పురికి బయల్దేరుతున్న ఫోటోను కూడా ఆయన ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
యుపిలో జరిగే ఏడు దశల పోలింగ్‌లో భాగంగా ఫిబ్రవరి 20న మూడవ దశలో కర్హాల్ నియోజకవర్గం పోలింగ్ జరుగనున్నది. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం అఖిలేష్ విలేకరులతో మాట్లాడుతూ కర్హాల్ నుంచి పోటీ చేయడానికి తనకు అవకాశమిచ్చిన మెయిన్‌పురి ప్రజలకు ధన్యవాదాలు తెలియచేశారు. ఈ ఎన్నికల్లో ప్రతికూల రాజకీయాలు నెరపేవారిని ప్రజలు ఓడిస్తారని తాను ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. సానుకూల రాజకీయాలతో ముందుకు సాగడమే తన ఆశయమని ఆయన అన్నారు. కర్హాల్‌లోనే కాక రాష్ట్రమంతటా సమాజ్‌వాది పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తమ పార్టీ రాష్ట్రానికి అభివృద్ధి పథంలో నడిపిస్తుందని ఆయన తెలిపారు. ఎన్నికల ప్రచారం కోసం మళ్లీ ఇక్కడకు వస్తారా అని విలేకరులు ప్రశ్నించగా తన ఎన్నికల ప్రచార బాధ్యతను ఇక్కడి పార్టీ నాయకులకు, ప్రజలకు అప్పగించానని, అవకాశం వస్తే తప్పక వస్తానని ఆయన తెలిపారు.
అయితే ప్రజలు మాత్రం మీరు ప్రచారం కోసం రావలసిన అవసరం లేదని చెప్పారని, ఏదేమైనా ఎన్నికల్లో గెలిచిన తర్వాత మళ్లీ ఇక్కడకు తప్పక వస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తన గెలుపు చారిత్రకమని, ప్రతికూల రాజకీయాలు చేసే వారికి అదో గుణపాఠం అవుతుందని ఆయన అన్నారు. ములాయం సింగ్ స్వగ్రామం సైఫైకు కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో కర్హాల్ నియోజకవర్గం ఉంది. ఒక్క 2002 ఎన్నికలు మినహాయించి 1993 నుంచి ఈ స్థానం సమాజ్‌వాది పార్టీకి కంచుకోట. 2002 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి టిక్కెట్‌పై ఎస్‌పి సిట్టింగ్ ఎమ్మెల్యే శోబారాన్ సింగ్ పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఎస్‌పిలో చేరిన ఆయన మూడు సార్లు వరుసగా గెలుపొందారు. కర్హాల్‌లో దాదాపు 3.7 లక్షల మంది ఓటర్లు ఉండగా వీరిలో 1.4 లక్షల మంది యాదవులు(37 శాతం), 34 వేల మంది శాఖ్యాలు(ఓబీసీలు), 14 వేల మంది ముస్లిములు ఉన్నారు.