లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఎయిర్ కండీషనర్‌లకు బాగా అలవాటు పడ్డారని సమాజ్‌వాదీ పార్టీ కీలక మిత్రుడు అన్నారు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో ఆరు సీట్లు గెలుచుకున్న సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్ బి ఎస్ పి) అధినేత ఓం ప్రకాష్ రాజ్‌భర్ ఆదివారం తూర్పు యూపిలో జరిగిన తన పార్టీ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు వార్తా సంస్థ పిటిై నివేదించింది.
“అఖిలేష్ యాదవ్ ఎయిర్ కండిషన్డ్ గదులకు బాగా అలవాటు పడ్డారు” అని సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ చీఫ్ తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. సమావేశం అనంతరం విలేకరులు ప్రశ్నించగా రాజ్‌భర్ ఆ వ్యాఖ్యలను ఖండించలేదు. “అతను బయటకు వెళ్లి వివిధ ప్రాంతాలలో పర్యటించాలి, తన పార్టీ కార్యకర్తలు , నాయకులతో కలవాలి, నేను చెప్పాలనుకున్నది ఇదే. నేను లక్నో వెళ్లి అతడిని బయటకు వచ్చేలా చేస్తాను” అని రాజ్‌భర్ చెప్పారు.
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ ను విమర్శించేందుకు రాజ్‌భర్ వ్యాఖ్యలను బిజెపి ఉపయోగించుకుంది. బిజెపికి చెందిన షెహజాద్ పూనావాలా తన ట్వీట్‌లో “అఖిలేష్ యాదవ్‌కు ఏసీ బాగా అలవాటయింది, వీధుల్లోకి ఆయన వెళ్లడం లేదని ఎస్పీ మిత్రపక్షం ఓపీ రాజ్‌భర్ తెలిపారు. “ఫ్యామిలీ ఫస్ట్”, సాధారణంగా పార్టీలు ఫారిన్ టూర్/ఏసీ/వెకేషన్/పార్టీ మోడ్‌లో 4.5 ఏళ్లు గడుపుతాయి. ఎన్నికలకు గత 6 నెలల ముందు వారు ప్రచార మోడ్‌లోకి వెళతారు. ప్రస్తుతం బాబు వెకేషన్ మోడ్‌లో ఉన్నారు” అన్నారు.