Monday, December 23, 2024

‘ఇండియా’ కూటమికి బీటలు?

- Advertisement -
- Advertisement -

భోపాల్: కేంద్రంలో బిజెపిని గద్దె దింపడమే లక్షంగా ఏర్పడిన ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’కి త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌లో ఎదురుగాలి తగిలే అవకాశాలు కనిపిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా తన అభ్యర్థుల జాబితాను ప్రకటించడంపై కూటమి భాగస్వామి అయిన సమాజ్‌వాది పార్టీ మండి పడుతోంది. కాంగ్రెస్ పార్టీ వైఖరిని వెన్నుపోటుగా అభివర్ణించిన ఎస్‌పి అధినేత, యుపి మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ రాబోయే లోక్‌సభలో ఉత్తరప్రదేశ్‌లో ఆ పార్టీపట్ల తాము కూడా అదేవిధంగా వ్యవహరిస్తామన్న సంకేతాలు ఇచ్చారు. అంతేకాదు మధ్యప్రదేశ్‌లో18 స్థానాల్లో తాము పోటీ చేయనున్నట్లు కూడా ప్రకటించారు. ‘మధ్యప్రదేశ్‌లో మాకు సీట్లు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేకపోతే ఆ విషయం ముందే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ గనుక లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇలాగే వ్యవహరిస్తే పార్టీతో ఎవరుంటారుఝ మా మనస్సుల్లో గందరగోళంతో బిజెపితో పోరాడితే మేము గెలవలేము’ అని అఖిలేశ్ శుక్రవారం విలేఖరులతో అన్నారు. ఇండియా కూటమిలో కొనసాగే విషయంపై పునరాలోచన చేస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు.

కాగా శనివారం ఈ విషయమై మధ్యప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేసులో ముందున్న కమల్‌నాథ్‌నుఆయన నియోజకవర్గమైన చింద్వాడాలో విలేఖరులు ప్రశ్నించగా ఆయన సమాధానాన్ని దాటవేసే ధోరణిలో మాట్లాడారు. అఖిలేశ్‌ను పట్టించుకోవడం మానేయండని అంటూ, అఖిలేశ్..వఖిలేశ్ గురించి మరిచిపొండని వ్యాఖ్యానించారు. అంతేకాదు మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. తమ అంచనాలకు మించి పెద్ద సంఖ్యలో తమ అభ్యర్థులు విజయం సాధిస్తారని అన్నారు. కాగా ఎన్నికలు జరిగినప్పుడు టికెట్ల కోసం పోటీ ఉండడం సహజం, ప్రతి ఒక్కరు కూడా బలమైన అభ్యర్థికే టికెట్ ఇవ్వాలనుకుంటారు. ఎన్‌డిఎ కూటమిలో అఖిలేశ్ యాదవ్ ముఖ్యమైన భాగస్వామి అని నేను అనుకొంటున్నాను. మా పార్టీలో చాలా మంది ఆయనతో టచ్‌లో ఉన్నారు. ఏదయినా అంశంపై చర్చ జరిగితే పరిష్కారం కానిది ఉండదు’ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సుప్రియా శ్రీనాతే అభిప్రాయపడ్డారు. కాగా అఖిలేశ్ యాదవ్ మాటలు కాంగ్రెస్ నిజస్వరూపమేమిటో చెప్తోందని బిజెపి అంటోంది.

భాగస్వామ్య పక్షాల పట్ల కాంగ్రెస్ వైఖరి ఎప్పుడూ పెద్దన్న తరహాలోనే ఉంటుందని, అందుకే ఆ పార్టీకి అందరూ దూరమవుతున్నారని కమలనాథులు అంటున్నారు. మరి ఈ పరిణామాలు మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌పార్టీ విజయావకాశాలపై ఎంతమేరకు ప్రభావం చూపిస్తాయో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. మరో వైపు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ కుటుంబానికి నాలుగు టికెట్లు దక్కడంపై సొంతపార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇవన్నీ చూస్తే అఖిలేశ్ యాదవ్ ఇండియా కూటమికి గుడ్‌బై చెప్పడం ఖాయమని రాజకీయ వర్గాలు భావిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News