లక్నోలో అఖిలేష్ సైకిల్ సవారీ
లక్నో: యుపిలో విజయం లక్షంగా సమాజ్‌వాది పార్టీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ గురువారం సైకిల్ యాత్ర చేపట్టారు. రాష్ట్ర రాజధాని లక్నోలో ఈ మాజీ సిఎం తన అనుచరులు వెంటరాగా సైకిల్ సవారీ జరిపారు. అంతకు ముందు స్థానికంగా ఉన్న పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, వ్యవసాయ చట్టాలు, నేరాల సంఖ్య వంటి వాటిపై నిరసన వ్యక్తం చేసేందుకు ఈ సైకిల్ యాత్రలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వంపై వ్యతిరేకత నెలకొందని, ఈ సారి అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ 400 స్థానాలు గెల్చుకుంటుందన్నారు. ప్రముఖ సోషలిస్టు నేత జానేశ్వర్ మిశ్రా జయంతిని పురస్కరించుకుని తాలూకా స్థాయిలలో సైకిల్ యాత్రలు చేపట్టినట్లు, ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
అయితే వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు క్షేత్రస్థాయిలో పార్టీని సమాయత్తం చేసేందుకు , సామాజిక సమీకరణల దిశలో బ్రాహ్మణ ఓటర్లను సానుకూలం చేసేందుకు ఈ సైకిల్ యాత్రలు ఏర్పాటు చేశారని రాజకీయ పరిశీలకులు తెలిపారు. యుపి అసెంబ్లీలో మొత్తం 403 స్థానాలు ఉన్నాయి. ఇప్పటివరకూ తమ పార్టీకి 350 స్థానాలు వస్తాయని అనుకున్నామని, అయితే ప్రభుత్వంపై ప్రజల నిరసనల కోణంలో చూస్తే తమకు ఖచ్చితంగా 400 సీట్లు దక్కుతాయని అంచనావేసుకున్నట్లు అఖిలేష్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలం అయింది. కోవిడ్ విషయంలో ప్రజలను గాలికి వదిలిపెట్టింది. ఆసుపత్రులలో ఆక్సిజన్ లేదు. మందులు దొరకడం లేదని విమర్శించారు. ప్రజలు చనిపోతూ ఉంటే చూస్తూ ఉందని మండిపడ్డారు.