Friday, November 22, 2024

కాంగ్రెస్ పార్టీపై అఖిలేష్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు..

- Advertisement -
- Advertisement -

ఇతర పార్టీలను ఫూల్ చేస్తూ నిండా ముంచే కాంగ్రెస్
తీవ్రస్థాయిలో మండిపడ్డ ఎస్‌పి నేత అఖిలేష్
ఇండియా కూటమి విషయంపై పునరాలోచన
మధ్యప్రదేశ్ సీట్ల పీటముడితో అగాధం
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి ఎప్పటికీ తన పెద్దన్న ధోరణిని వీడదని, ఇతర పార్టీలను ఫూల్ చేస్తుందని సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ విమర్శించారు. ప్రతిపక్షాలు ఇండియా జట్టుగా కూటమి కడుతున్న దశలో అఖిలేష్ వ్యాఖ్యలు ఓ ఝలక్‌గా మారాయి. కాంగ్రెస్‌ను ఇరకాటంలోకి నెట్టాయి. రాష్ట్రాల స్థాయిలో కూటమి చెల్లుబాటు కాదని వారికి తెలియదా? తెలిస్తే ఈ దిశలో ఇండియా కూటమి తరఫున దీనికి అనుకూలంగా వారు ఎందుకు స్పందించడం లేదు? అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. అన్ని వాస్తవిక విషయాలను పరిశీలించుకుని తాము లోక్‌సభ ఎన్నికలకు సరైన విధంగా ముందుకు వెళ్లుతామని అఖిలేష్ వెల్లడించారు.

లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడంపై తాము పునరాలోచనకు దిగుతామని సంకేతాలు వెలువరించారు. ప్రతిపక్షాల ఐక్యత ప్రత్యేకించి బిజెపిని ఎదుర్కొవడం విషయంలో తాము అంటే ప్రాంతీయ పార్టీలూ ఎప్పుడూ త్యాగం వహించాలని కాంగ్రెస్ భావిస్తుందా? అని అఖిలేష్ ప్రశ్నించారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల దశలో కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీలు 18 సీట్ల విషయంలో ఏకాభిప్రాయానికి రాలేకపొయ్యాయి. జాతీయ స్థాయిలో రెండు పార్టీలకూ పొత్తు ఉన్నప్పటికీ ఇక్కడ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీకి దిగుతూ ఉండటం, కాంగ్రెస్‌కు ఎస్‌పి 18 స్థానాలను వదలిపెట్టకపోవడంతో పరిస్థితి ఇప్పుడు బిజెపికి అనుకూలంగా మారుతోంది. అక్కడ బిజెపి వ్యతిరేక లేదా అధికార వ్యతిరేక ఓట్లకు గండిపడనుంది.

ఈ పరిణామం మధ్యప్రదేశ్‌లోని అధికార బిజెపికే సానుకూలతను తెచ్చిపెడుతుంది. కాంగ్రెస్ ఆధిపత్య ధోరణితోనే ఇటువంటి పరిణామాలు జరుగుతున్నాయని అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పరిణామాలే వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి సంఘటితానికి ప్రతీక అవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో తమ పార్టీ బలంగా ఉన్న చోట్ల పోటీకి తమకే అవకాశం ఇవ్వాలని తాము మాజీ ముఖ్యమంత్రి, పిసిసి నేత కమల్‌నాథ్‌ను కోరామని, ఎడతెగని చర్చల తరువాత కేవలం రెండు సీట్లు వదిలిపెట్టేందుకు కాంగ్రెస్ సిద్ధం అయిందని అఖిలేష్ తెలిపారు. ఇక్కడి పరిణామాలను బట్టి చూస్తూ ఉంటే రాష్ట్రాల వారిగా సర్దుబాట్లు వీలు కావని, ఇండియా కూటమి సర్దుబాట్లు కేవలం జాతీయ స్థాయిలో అంటే వచ్చే లోక్‌సభ ఎన్నికలకే పరిమితం అవుతుందని స్పష్టమవుతోందని ఎస్‌పి నేత తెలిపారు.

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నవరాత్రి తొలిరోజునే కాంగ్రెస్ పార్టీ 144 మంది అభ్యర్థులతో తమ మొదటి జాబితాను వెలువరించింది. ఇందులో ఎస్‌పి ఆశిస్తున్న కొన్ని స్థానాలు కూడా ఉన్నాయి. ఇది ఎస్‌పి కాంగ్రెస్ మధ్య వివాదానికి దారితీసింది. బుధవారం సాయంత్రం ఎస్‌పి 22 మంది అభ్యర్థులతో వెలువరిచిన జాబితాలో 13 చోట్ల కాంగ్రెస్‌తో పోటీకి దిగింది. ఈ దశలోనే కాంగ్రెస్ నేత ఒకరు స్పందిస్తూ మధ్యప్రదేశ్‌లో ఎస్‌పికి ఏం బలం ఉందని, పోటికి దిగుతుంది? కాంగ్రెస్ చెప్పినట్లు నడుచుకుంటే మంచిదని వ్యాఖ్యానించడం మరింత వివాదాస్పదం అయింది. దీనిపై అఖిలేష్ తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఛోటామోటా, చుట్టపు చూపుల్లాగా వచ్చిపోయే నేతలు ఏది పడితే అది మాట్లాడితే కుదరదని పేర్కొన్న అఖిలేష్ ఎస్‌ఫి బలమెంతో కాంగ్రెస్‌కు యుపిలో చూపిస్తామని చురకలు పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News