యోగిపై అఖిలేష్ వ్యంగ్యాస్త్రాలు
ఎస్‌పిలో చేరిన మంత్రులు మౌర్య, సైని
లక్నో: సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అధికార బిజెపిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. త్వరలో జరగనున్న యుపి అసెంబ్లీ ఎన్నికలలో తమకు నాలుగింట మూడు వంతుల సీట్లు దక్కుతాయంటూ బిజెపి చేసిన వ్యాఖ్యలపై అఖిలేష్ స్పందిస్తూ ఆ పార్టీ ఉద్దేశం తమకు 3 లేక 4 సీట్లు మాత్రమే వస్తాయనడమేనని ఎద్దేవా చేశారు. బిజెపి చెబుతున్న 80:20 నిష్పత్తి గురించి ఆయన వ్యాఖ్యానిస్తూ యుపి ఎన్నికలలో 20 శాతం మంది ప్రజలు మాత్రమే బిజెపిని బలపరుస్తారని, మిగిలిన 80 శాతం మంది ప్రజలు సమాజ్‌వాది పార్టీకి మద్దతు ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. అయితే స్వామి ప్రసాద్ మౌర్య, ఇతర బిజెపి నేతలు తమ పార్టీలో చేరిన తర్వాత ఆ మిగిలిన 20 శాతం సీట్లు కూడా బిజెపికి దక్కబోవని ఆయన అన్నారు. శుక్రవారం నాడిక్కడ పార్టీ ప్రధాన కార్యాలయంలో మౌర్య, తదితరులకు పార్టీ సభ్యత్వాన్ని అందచేసి పార్టీలోకి ఆయన ఆహ్వానించారు.
ఈ సందర్భంగా అఖిలేష్ మాట్లాడుతూ బాబా ముఖ్యమంత్రి(ఆదిత్యనాథ్) లెక్కల టీచరును పెట్టుకోవాలంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ యుపి అసెంబ్లీ ఎన్నికలలో 80 శాతం మంది ప్రజలు ఒకవైపు, 20 శాతం మంది ప్రజలు మరో వైపు ఉంటారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని 20 శాతం ముస్టిం జనాభాను ఉద్దేశించి ఆయన అలా వ్యాఖ్యానించారని పలువురు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా&మాజీ మంత్రి, ప్రముఖ ఒబిసి నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య, మరో అసమ్మతి మంత్రి ధరమ్ సింగ్ సైనితో కలసి సమాజ్‌వాది పార్టీలో చేరారు. వీరితోపాటు ఐదుగురు బిజెపి ఎమ్మెల్యేలు, అప్నా దళ్(సోనేలాల్) ఎమ్మెల్యే అమర్ సింగ్ చౌదరి కూడా అఖిలేష్ సమక్షంలో ఎస్‌పిలో చేరారు. వీరికి అఖిలేష్ పార్టీ సభ్యత్వాలను అందచేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.