75 కిమీల ప్రత్యేక తారుతో …4 రోజుల్లో
అమరావతి నుంచి అకోలా మధ్య 53వ జాతీయ రహదారిపై నిర్మించిన 75 కిలోమీటర్ల రాదారి ఇది. పైగా కేవలం నాలుగు రోజుల వ్యవధిలో దీనిని నిర్మించారు. ఈ విధంగా పలు ప్రత్యేకతలు సంతరించుకున్న ఈ రాదారి ఇప్పటివరకూ ఓ ఖతార్ సంస్థ దక్కించుకున్న గిన్నీస్ రికార్డును తిరగరాసింది. ఇది గర్వకారణం అని రహదారులు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. బైట్యుమినస్ కాంక్రిటు రోడ్డుగా దీనిని పిలుస్తారు. భారత జాతీయ రహదారుల అధికారిక సంస్థ (ఎన్‌హెచ్‌ఎఐ ) అనుబంధం అయిన రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ ప్రైవేటు లిమిటెడ్, జగదీష్ కదం ఈ రికార్డును స్థాపించారు. ప్రత్యేక తరహా కాంక్రిట్‌తో ఈ రోడ్‌ను నిర్మించిన సిబ్బందిని తాము అభినందిస్తున్నామని మంత్రి ట్వీటు వెలువరించారు. పైగా ఈ రోడ్డు నిర్మాణం కూడా రికార్డు టైంలో 105 గంటల 33 నిమిషాలలో పూర్తి చేశారు. ఈ నెల 3వ తేదీన ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పనులు ఈ నెల 7వ తేదీన సాయంత్రం ఏడు గంటలకు పూర్తి అయ్యాయి. దాదాపు 800 మంది కార్మికులు రాత్రింబవళ్లు షిప్టులలో పనిచేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని మంత్రి కితాబు ఇచ్చారు.