Saturday, December 21, 2024

కిటకిటలాడిన నగల దుకాణాలు

- Advertisement -
- Advertisement -

అక్షయ తృతియ రోజు జోరుగా బంగారం అమ్మకాలు
రెండేళ్ల తర్వాత పెరిగిన వినియోగదారుల రద్దీ
30 టన్నుల వ్యాపారం జరుగుతుంది: జిజెసి వైస్ చైర్మన్ మెహ్రా

Akshaya tritiya story

మన తెలంగాణ/ హైదరాబాద్/ ముంబై : దాదాపు రెండేళ్ల తర్వాత బంగారం నగల దుకాణాలు కిటకిటలాడాయి. పసిడి కొనుగోళ్లకు శుభప్రదమైన రోజుగా భావించే అక్షయ తృతీయ నాడు(మంగళవారం) జువెలరీ షాప్‌లలో జనాలతో సందడి వాతావరణం నెలకొంది. కరోనా మహమ్మారి కారణంగా ఇంత కాలం కొనుగోళ్లు లేక షాప్‌లు వెలవెలబోయాయి. అయితే అక్షయ తృతీయ రోజు కొనుగోళ్లు జరిపేందుకు ప్రజలు పెద్దఎత్తున ముందుకు వచ్చారు. మంగళవారం రోజు పండుగ రోజు సెలవు, అక్షయ తృతీయ రెండూ ఉండడం కూడా షాప్‌లకు కలిసివచ్చింది. వేసవి కావడంతో సాయంత్రం సమయంలో రద్దీ పెరిగింది. ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్(జిజెసి) వైస్ చైర్మన్ శ్యామ్ మెహ్రా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జువెలర్స్ ఉదయాన్నే స్టోర్లను తెరిచారని, ఉదయం నుంచే సానుకూల వాతావరణం కనిపించిందని అన్నారు. గత 1015 రోజులుగా మార్కెట్లో సానుకూల వాతావరణం ఉందని, అక్షయ తృతీయ రోజు కూడా కనిపిస్తుందని భావించామని అన్నారు. ఈ పవిత్రమైన రోజున 25 నుంచి 30 టన్నుల వ్యాపారం జరుగుతుందని ఆశిస్తున్నామని మెర్హా పేర్కొన్నారు. రూ.55 వేల నుంచి రూ.58 వేల మధ్య ఉన్న బంగారం ధరలు ఇప్పుడు 10 గ్రాములు ధర రూ.50,500కు దగిరావడం కూడా అమ్మకాలు పెరగడానికి కారణమైందని ఆయన వివరించారు. పిఎన్‌జి జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ సౌరభ్ గాడ్గిల్ మాట్లాడుతూ, కస్టమర్ల సంఖ్య పెరిగిందని, రోజు గడిచే కొద్దీ ఇది మరింత పెరుగుతుందని భావిస్తున్నామని అన్నారు. శుభ్ కళ్యాణ్ జ్యువెలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కళ్యాణరామన్ మాట్లాడుతూ, అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేయడం అత్యంత శుభప్రదమని, ఈ సంప్రదాయం మార్కెట్‌లో సానుకూల ధోరణిని కొనసాగిస్తోందని అన్నారు. ఈ ఏడాది భారత మార్కెట్‌లో కొనుగోలు శక్తి పెరిగిందని కారట్‌లేన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సిఒఒ), సహ వ్యవస్థాపకుడు అవనీష్ ఆనంద్ తెలిపారు.

గత రెండేళ్లుగా వ్యాపారం బాగా లేదు

గత రెండేళ్లుగా అక్షయ తృతీయ సమయంలో లాక్‌డౌన్ కారణంగా బులియన్ వ్యాపారం బాగా లేదు. కానీ ఈ సంవత్సరం కోవిడ్ వ్యాప్తి తక్కువగా ఉంది. ఆర్థిక కార్యకలాపాలు కూడా పుంజుకున్నాయి. సాధారణంగా అక్షయ తృతీయ నాడు దేశంలో 20 నుండి 24 టన్నుల బంగారం అమ్ముడవుతుంది. అయితే ఈ సంవత్సరం దాదాపు 30 టన్నుల బంగారం అమ్ముడవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత బంగారం ధర ప్రకారం, ఈ ఏడాది అక్షయ తృతీయ నాడు రూ.15,000 కోట్ల విలువైన బంగారాన్ని విక్రయించే అవకాశముంది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా మాట్లాడుతూ, ఈ సంవత్సరం కస్టమర్ సెంటిమెంట్ చాలా బాగుందని అన్నారు. కరోనా భయం, మహమ్మారికి సంబంధించిన ఆంక్షలు ముగిశాయి, అయితే గత కొన్ని రోజులుగా ధరలు తగ్గాయి. ధరల పెరుగుదల కారణంగా అమ్మకాలపై ప్రభావం పడుతుందనే భయం కూడా ముగిసింది. ఈసారి బంగారం విక్రయాలు దాదాపు 23 శాతం పెరిగే అవకాశం ఉందని అన్నారు.

4 ఏళ్ల క్రితంతో పోలిస్తే 64% లాభం

నాలుగు సంవత్సరాల క్రితం అక్షయ తృతీయ నాడు కొనుగోలు చేసిన బంగారంపై ఇప్పటి రేటుతో పోలిస్తే 64 శాతం లాభం వచ్చింది. 2018 ఏప్రిల్ 28న అక్షయ తృతీయ రోజున బంగారం పది గ్రాములు రూ.31,534 ఉంది. ఆ సమయంలో బంగారం కొనుగోలు చేసిన వారు 2022 ఏప్రిల్ 30న మార్కెట్ ముగిసే సమయానికి బంగారం ధర రూ.51,795 ఉందంటే 64 శాతం లాభాన్ని పొందారన్న మాట. ఆర్థిక సలహా సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రకారం, ఈ సంవత్సరం బంగారం 55,000 దాటవచ్చు. రాబోయే 12 నెలల వరకు కొమెక్స్‌లో బంగారం ఔన్సుకు 2,050 డాలర్లు అంటే 10 గ్రాములకు రూ.55,320 శ్రేణిలో ట్రేడ్ కానుంది. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా ప్రకారం, బంగారంలో బుల్లిష్ ట్రెండ్ కొనసాగుతుందని, ఈ ఏడాది రూ.55,000 మార్కును దాటవచ్చని అన్నారు. అంటే బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయమని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News