మనతెలంగాణ/యాదాద్రి : శ్రీ లక్ష్మి నరసింహస్వామి యాదాద్రి క్షేత్రంలో ఆలయ క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయస్వామికి విశేషంగా ఆకుపూజ కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. మంగళవారం శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ఉదయం స్వామి వారికి సింధూర క్షేపనం నిర్వహించి లక్ష తమలపాకులతో నాగవల్లి దళార్చన జరిపి శాస్త్రోక్తంగా ఆకుపూజను నిర్వహించారు.
పాతగుట్ట పుష్కరిణి వద్ద గల ఆలయాలలో ఆకుపూజను నిర్వహించగా భక్తులు పాల్గొని దర్శించుకున్నారు. యాదాద్రి క్షేత్రములో నిర్వహించిన నిత్యపూజలు సుప్రభాతం,అర్చన, అభిషేకం, సుదర్శన నారసింహ హోమం, నిత్యకల్యాణం, పుష్పర్చన, జోడి సేవ తదితర పూజలలో భక్తులు పాల్గొని శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీవారి అనుబంధ ఆలయమైన శ్రీ పాత లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో భక్తులు అర్జిత సేవ పూజలలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.
శ్రీవారి నిత్యరాబడి..
శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం యాదాద్రి క్షేత్రంలో స్వామివారి ఆలయం నిత్యరాబడి భాగంగా మంగళవారం రోజున 37 లక్షల 94 వేల 693 రూపాయలు అనుభంద ఆలయమైన పాతగుట్ట దేవాలయం, వివిధ శాఖల నుండి స్వామివారి నిత్యరాబడి సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు..
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని ప్రముఖులు దర్శించుకున్నారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని ఐఏఎస్ స్పెషల్ సెక్రటరి ఢీల్లీ ఏసిబి, విజిలెన్స్ అధికారి వై.వి.వి.వి. రాజశేఖర్ దర్శించుకున్నారు. శ్రీ స్వామివారి సతిసమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించిన ఆయనకు ఆలయ అర్చకులు శ్రీ స్వామి వారి ఆశీర్వచనము అందచేశారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంటరమణరెడ్డి కుటుంబ సమేతంగా శ్రీలక్ష్మీనరసింహుని దర్శించుకొని ప్రత్యేకపూజలను నిర్వహించారు.