ఖార్‌టౌమ్: సూడాన్ భద్రతాదళాలు తమ జర్నలిస్ట్ ముసాల్మీ ఇఐ కబ్బాషీని అరెస్ట్ చేశాయని అల్‌జజీరా ఛానల్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఖతార్ కేంద్రంగా అల్‌జజీరా శాటిల్లైట్ ఛానల్ నడుస్తోంది. కబ్బాషీని వెంటనే విడుదల చేయాలని, ఆయన స్వేచ్ఛగా తన విధులు నిర్వహించుకునేందుకు వీలు కల్పించాలని అల్‌జజీరా ఆ ప్రకటనలో కోరింది. ఖార్‌టౌమ్‌లోని తన నివాసంలో ఉండగా కబ్బాషీని సైన్యం అరెస్ట్ చేసిందని తెలిపింది. ఆయన భద్రతకు సైన్యమే బాధ్యత వహించాలని తెలిపింది. శనివారం సూడాన్ రాజధాని ఖార్‌టౌమ్‌సహా పలు పట్టణాల్లో సైనికపాలనకు నిరసనగా ఆందోళనలు జరిగాయి. వేలాదిమంది వీధుల్లోకి చేరి నిరసన తెలిపారు. ఈ ఆందోళనల్లో పాల్గొన్నవారిపై సైన్యం జరిపిన కాల్పుల్లో 15 ఏళ్ల బాలుడుసహా ఆరుగురు చనిపోయారు. ఈ ఏడాది అక్టోబర్ 26న సైనిక తిరుగుబాటు జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు 21మంది ఆందోళనకారులు చనిపోయారు.