కర్నాటక హిజాబ్ వివాదంపై అల్‌ఖైదా చీఫ్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: నిషిద్ధ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా చీఫ్ అయిమన్ అల్ జవాహిరి మరణంపై వస్తున్న వదంతులకు తెరపడింది. అతని ప్రసంగంతో కూడిన తాజా వీడియో బయటకొచ్చింది. అందులో అతను భారతదేశంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఇందుకు అతను కర్నాటకలో ఇటీవల రాజుకున్న హిజాబ్ వివాదాన్ని వాడుకున్నాడు. 8.43 నిమిషాల పాటు ఉన్న ఈ వీడియో క్లిప్పింగ్‌లో అతను హిజాబ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న తన తోటి కళాశాల విద్యార్థులను ధైర్యంగా ఎదుర్కొన్న ముస్కాన్ ఖాన్ అనే విద్యార్థినిని ప్రశంసలతో ముంచెత్తాడు. ధైర్యంగా ముందడుగు వేసిన తన ముజాహిద్ సోదరి కోసం రాసిన ఒక కవితను కూడా అతను ఆ వీడియోలో చదివాడు. హిందూ భారతదేశాన్ని, ఆ దేశంలోని మతతత్వ ప్రజాస్వామ్యాన్ని బయటపెట్టినందుకు అల్లా ఆమెను ఆశీర్వదించాలని కోరుకుంటున్నట్లు జవాహిరి ఆ వీడియోలో పేర్కొన్నాడు. మనలో ఉన్న భ్రమలను తొలగించుకోవాలని, భారత హిందూ ప్రజాస్వామ్యం వల్ల జరిగే అనర్థాలను అడ్డుకోవాలని అతను భారత ఉపఖండంలోని ముస్లింలకు పిలుపునిచ్చాడు. వాస్తవ ప్రపంచంలో మానవ హక్కులు కాని రాజ్యాంగం పట్ల గౌరవం కాని న్యాయం కాని లేవని గ్రహించాలంటూ అతను పిలుపునిచ్చాడు. ఈ వీడియోను అమెరికాకు చెందిన సైట్ నిఘా సంస్థ ధువ్రీకరించింది.