Monday, December 23, 2024

అల్ షిఫా ఆసుపత్రి ఖాళీ..

- Advertisement -
- Advertisement -

ఖాన్ యూనిస్ : గాజాలో వేలాది మందికి చికిత్సలు అందిస్తూ వచ్చిన అల్ షిఫా ఇప్పుడు ఖాళీ అయింది. ఇజ్రాయెల్ సేనలు తీవ్రస్థాయిలో ఆదేశాలు వెలువరించడంతో అక్కడి రోగులు, సిబ్బంది, నిర్వాసిత ప్రజలు ఆసుపత్రి నుంచి వెళ్లిపొయ్యారని గాజా ఆరోగ్య శాఖ అధికారులు శనివారం తెలిపారు. షిఫా ఆసుపత్రి హమాస్ మిలిటెంట్లకు స్థావరం అయిందని పేర్కొంటూ పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ సేనలు ఈ ఆసుపత్రిని చుట్టుముట్టాయి. లోపలికి ప్రవేశించాయి. లోపల ఉన్న వారందరిని వీరు బయటకు పంపించారని పాలస్తీనియా అధికారులు చెపుతున్నారు. అయితే ఈ వాదనను ఇజ్రాయెల్ సైనిక వర్గాలు ఖండించాయి. ఆసుపత్రిని ఖాళీ చేయించాలని తమకు ఇజ్రాయెల్ నుంచి ఆదేశాలు వెలువడ్డాయని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

ఈ లోగానే చాలా మంది రోగులు , ఇక్కడ తలదాచుకుంటూ వస్తోన్న వారు నిష్క్రమించారు. బయటకు వెళ్లే వారికి తాము సహకరించినట్లు, వారికి దారి చూపినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అయితే ఆసుపత్రిలో విషమ ఆరోగ్య పరిస్థితిలో ఉన్న వారి పరిస్థితి ఏమిటనేది వెల్లడికాలేదు. ఇక కదలలేని వారు, ఎమర్జెన్సీ వార్డులు, ప్రసూతి విభాగంలోని వారి పరిస్థితి గురించి స్పష్టత రాలేదు. గాజా స్ట్రిప్‌లో శనివారం కొంత మేర ఇంటర్నెట్, ఫోన్ సౌకర్యాలు పునరుద్ధరణ జరిగింది. కాగా ఖాన్ యూనిస్‌లో శనివారం ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఓ భవనం దెబ్బతింది. శివార్లలో ఉన్న పట్టణంలో జరిగిన ఈ దాడిలో దాదాపు 26 మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News