Saturday, December 21, 2024

25న అలయ్ బలయ్

- Advertisement -
- Advertisement -

హాజరుకానున్న ఏడు రాష్ట్రాల గవర్నర్లు, వివిధ పార్టీల ప్రతినిధులు
తెలంగాణ సంస్కృతి చాటేలా వంటకాలు, కళారూపాలు : బండారు విజయలక్ష్మీ

మనతెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతి, ఆనవాయితీ, సంప్రదాయ చిహ్నంగా జరిగే అలయ్ బలయ్ కార్యక్రమం మరింత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆహ్వాన కమిటీ చైర్‌పర్సన్ బండారు విజయలక్ష్మీవెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 25వ తేదీన నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమానికి ఏడు రాష్ట్రాల గవర్నర్లు, బిజెపి, బిఆర్‌ఎస్, కాంగ్రెస్‌తో వివిధ పార్టీలకు చెందిన నేతలను ఆహ్వానించినట్లు ఆమె తెలిపారు. గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలంగాణ సమాజంలో అనేక వైరుధ్యాల భిన్న అభిప్రాయాలూ కలిగిన వారిని ఏకం చేసి అలయ్ బలయ్ కార్యక్రమం ప్రారంభించారని గుర్తుచేశారు. అలయ్ బలయ్‌ని ఒక ఉద్యమ దిక్సూచిగా, అన్ని పార్టీల మధ్య స్నేహ పూర్వక వాతావరణానికి నాంది పలికిందన్నారు. కార్యక్రమంలో ప్రముఖులను, ఔత్సహికులను ఆహ్వానించి వారిని సన్మానించనున్నట్లు విజయలక్ష్మీ వెల్లడించారు.

తెలంగాణ వంటకాలతో అతిధులకు భోజన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అలయ్ బలయ్‌కి రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై, గవర్నర్లు బన్వరీలాల్ పురోహిత్ (పంజాబ్), ఆచార్య దేవవ్రత్ (గుజరాత్), రాధాకృష్ణన్ (జార్ఖండ్ ), ఎన్.ఇంద్రసేనారెడ్డి (త్రిపుర), డాక్టర్ కంభంపాటి హరిబాబు (మిజోరాం), బండారు దత్తాత్రయ (హర్యానా), కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్,జి. కిషన్‌రెడ్డి, మురళీధరన్, అర్జున్‌రామ్ మేఘవాల్, భారతి ప్రవీణ్ పవార్‌తో పాటు రాష్ట్ర స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు పాల్గొంటారని వెల్లడించారు. ఈ సమావేశంలో అలయ్ బలయ్ కమిటీ ప్రతినిధులు చింతల రామచంద్రారెడ్డి, శ్యామ్‌సుందర్‌గౌడ్,గౌతమ్‌రావు, మహేష్, సత్యం, తదితరులు పాల్గొన్నారు.

Bandaru 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News