Wednesday, January 22, 2025

అల్కరాజ్ టాప్ ర్యాంక్ మరింత పదిలం

- Advertisement -
- Advertisement -

లండన్ : వింబుల్డన్ ట్రోఫీతో అదగొట్టిన స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కరాజ్ ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఎటి పి మంగళవారం తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో అల్కరాజ్ టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. 20 ఏళ్ల అల్కరాజ్ కొంతకాలంగా పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానాన్ని కాపాడుకున్నాడు. ప్రస్తుతం అల్కరాజ్ 9,675 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. వింబుల్డన్‌కు ముందు అల్కరాజ్ పాయింట్లు చాలా తక్కువగా ఉండేవి.

అతనికి రెండో స్థానంలో ఉన్న జకోవిచ్‌కు మధ్య పాయింట్ల తేడా కొద్దిగానే ఉంది. ఒకవేళ అల్కరాజ్ వింబుల్డన్‌లో టైటి ల్ సాధించడంలో విఫలమైతే మాత్రం అగ్రస్థానం జకోవిచ్‌కే దక్కేది. కానీ జకోవిచ్‌తో జరిగిన మారథన్ ఫైనల్ సమరంలో గెలిచి అల్కరాజ్ ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్ ట్రోఫీ ని సొంతం చేసుకున్నాడు. ఈ విజయం అల్కరాజ్‌కు ఎంతో కలిసి వచ్చింది. తాజా ర్యాంకింగ్స్‌లో పాయింట్లను గణనీయంగా పెంచుకునేందుకు ఇది దోహదం చేసింది. స్పెయిన్ యువ ఆటగాడు అల్కరాజ్ కొంతకాలంగా పురుషుల టెన్నిస్‌లో ఎదురులేని శక్తిగా కొనసాగుతున్నాడు. వరుస టైటిల్స్‌తో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. నిలకడైన ఆటతో అలరిస్తున్న అల్కరాజ్ ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానాన్ని కాపాడు కోవడంలో సఫలమవుతున్నాడు. వింబుల్డన్ టైటిల్‌తో అతని టాప్ ర్యాంక్ మరింత పటిష్టంగా తయారైంది.

ఇక సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ రెండో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. జకోవిచ్ 8,795 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ ఏడాది జకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను సాధించాడు. అంతేగాక వింబుల్డన్‌లోనూ రన్నరప్‌గా నిలిచాడు. దీంతో జకోవిచ్ కూడా గణనీయమైన పాయింట్లను సొంతం చేసుకున్నాడు. ఇక సమీప భవిష్యత్తులో జకోవిచ్ టాప్ ర్యాంక్ ను అందుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. ఎందుకంటే జకోవిచ్‌తో పోల్చితే అల్కరాజ్ అద్భుత ఆటను కనబరుస్తున్నాడు.

ఈ పరిస్థితుల్లో రానున్న రోజుల్లో అతని టాప్ ర్యాంక్ కు ఎలాంటి ఇబ్బంది ఉండక పోవచ్చు. రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదేవ్ 6,520 పాయింట్లతో మూడో, కాస్పర్ రూడ్ (నార్వే) నాలుగో, స్టెఫానొస్ సిట్సిపాస్ (గ్రీక్) ఐదో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. హోల్గర్ రూనే (డెన్మార్క్) ఆరో, ఆండ్రీ రుబ్లేవ్ (రష్యా) ఏడో, జన్నిక్ సిన్నర్ (ఇటలీ) ఎనిమిదో, ఫ్రిట్జ్ (అమెరికా) తొమ్మిదో, టియోఫి (అమెరికా) పదో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. ఇక మాజీ నంబర్ వన్, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ తాజా ర్యాంకింగ్స్‌లో 140 స్థానానికి పడిపోవడం విశేషం. గాయాలతో నాదల్ చాలా కాలంగా టెన్నిస్‌కు దూరంగా ఉండడంతో అతని ర్యాంకిం గ్ పూర్తిగా పడిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News