మాస్కో: విషప్రయోగానికి గురై జర్మనీలో చికిత్స పొందిన కాలంలో ప్రొబేషన్ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవాల్నీకి రెండున్నరేళ్లకు పైగా జైలు శిక్ష విధిస్తూ రష్యా కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు బద్ధ విరోధి అయిన 44 ఏళ్ల నవాల్నీ జనవరి 17న జర్మనీ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన వెంటనే రష్యా పోలీసులు అరెస్టు చేశారు. అధ్యక్షుడు పుతిన్ తనపై విషప్రయోగం జరిపించారని నవాల్నీ ఆరోపిస్తున్నారు. రహస్యంగా జర్మనీకి పారిపోయిన నవాల్నీ అక్కడ ఐదు నెలల పాటు చికిత్స పొంది రష్యాకు తిరిగి వచ్చారు. 2014లో మనీ లాండరింగ్ కేసులో నవాల్నీకి కోర్టు జైలు శిక్ష విధించింది.
తనపై రాజకీయ కక్షతో ఈ ఆరోపణలు చేశారని నవాల్నీ అప్పీలు చేసుకోవడంతో ఆయనకు విధించిన శిక్షను సస్పెండ్ చేశారు. అయితే శిక్ష నిలిపివేత కాలంలో ఆయన ప్రొబేషన్ షరతులు ఉల్లంఘించారన్న ఆరోపణలపై తాజాగా జైలు శిక్షను కోర్టు విధించింది. ఇలా ఉండగా నవాల్నీ అరెస్టుపై గత రెండు వారాలుగా రష్యా వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పుతిన్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు హోరెత్తుతున్నాయి. గత ఆదివారం నాడు మాస్కోలో 1900 మందికి పైగా నిరసనకారులను పోలీసులు అరెస్టు చేయగా దేశవ్యాప్తంగా 5,750 మందికి పైగా అరెస్టు అయ్యారు.