మెంబర్‌షిప్ పేరుతో మోసం..?
రూ.20 లక్షలు తీసుకొని రూ.20 వేలకు రశీదు
ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేస్తున్న ఉద్యోగ సంఘం నాయకులు
ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన బాధితులు
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి మండలం గోపనపల్లి సర్వే నెంబర్ 36, 37లలోని ఎపి ఎన్జీఓ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. ఇప్పటికే ఈ భూముల్లోని ప్లాట్లను కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు పలువురు ఉద్యోగులకు విక్రయించినట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో దానిపై త్వరలో విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్టుగా తెలిసిదింది. ఉమ్మడి ఎపి ప్రభుత్వంలో గోపనపల్లిలో ఎపి ఎన్జీఓ ఉద్యోగులకు 189 ఎకరాలను 2003లో అప్పటి ప్రభుత్వం కేటాయించింది. ఇందులో నుంచి 30 ఎకరాలు ప్రైవేటు వ్యక్తులు స్వాధీనం చేసుకోవడం, మరో 10 ఎకరాలను స్వాతంత్య్ర సమరయోధులకు ప్రభుత్వం కేటాయించింది. దీంతో మిగిలిన భూమిని అప్పటి ఎపి ఎన్జీఓ ఉద్యోగ సంఘం నాయకులు సుమారు రూ. 3 కోట్లు ఖర్చుపెట్టి 149 ఎకరాల భూమిని అప్రూవల్ లే ఔట్ చేయించారు.
ఒక్కో ఉద్యోగికి 100 గజాల స్థలం చొప్పున మొత్తం 1680 మందికి అప్పట్లోనే స్థలాలను ఎపి ఎన్జీఓ ఉద్యోగ సంఘం నాయకులు కేటాయించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తరువాత ఆ భూములను కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆ భూములకు రక్షణ కల్పిస్తోంది. దీంతో ఆ భూములపై కన్నేసిన కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు అందులోని ప్లాట్లను ఉద్యోగులకు విక్రయిస్తున్నట్టుగా తెలిసింది. అయితే ఈ భూములను గత ప్రభుత్వం ఏ సొసైటీకి, ఏ సంఘానికి కేటాయించకపోవడంతో కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు వాటిని తెగఅమ్మేస్తున్నారని ప్రస్తుత ప్రభుత్వానికి ఫిర్యాదులు అందినట్టుగా తెలిసింది.
10 ఎకరాలు స్వాతంత్య్ర సమరయోధులకు…
ప్లాట్లు లేని ప్రభుత్వ ఉద్యోగుల అవసరాలను ఆసరా చేసుకొని కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు సభ్యత్వం పేరుతో రూ.20 లక్షలను తీసుకొని కచ్చితంగా ప్లాట్ వస్తుందని వారిని మోసం చేస్తున్నట్టుగా సమాచారం. అయితే చాలామంది ఉద్యోగులు ప్రత్యేక తెలంగాణ ఏర్పడగానే తమకు ఆ ప్లాట్లకు కేటాయించాలని, అందులో భాగంగా తాము సొసైటీలో చేరుతామని ఉద్యోగ సంఘాల నాయకులతో పేర్కొనడంతో ఇదే అదునుగా ఈ కొత్త దందాకు తెరతీసినట్టుగా తెలిసింది. కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు ఒక్కో ఉద్యోగి నుంచి తమ సొసైటీలో మెంబర్‌షిప్ పేరిట రూ.20 లక్షలను తీసుకొని రూ.20 వేలకు రశీదు ఇస్తున్నట్టుగా పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం రూ.20 లక్షలు చెల్లించిన ఉద్యోగులకు రానున్న రోజుల్లో కచ్చితంగా ప్లాట్‌ను ఇప్పిస్తామని ఈ ఉద్యోగ సంఘాల నాయకులు మోసం చేసినట్టుగా ప్రభుత్వానికి బాధితులు ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. అయితే ఎపి ఉద్యోగ సంఘం నాయకులతో కలిసి తెలంగాణ ఉద్యోగ సంఘం నాయకులు ఈ మెంబర్‌షిప్ దందాకు తెరతీసినట్టుగా తెలిసింది.
కావాలనే కొంతమంది తమ సొసైటీపై నిందలు వేస్తున్నారు..
భాగ్యనగర్ టిఎన్జీఓ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు ఎం. సత్యనారాయణ గౌడ్
కావాలనే కొంతమంది తమ సొసైటీ మీద నిందలు వేస్తున్నారు. తమ దృష్టికి ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. గతంలో భాగ్యనగర్ టిఎన్జీఓ హౌసింగ్ సొసైటీలో మెంబర్‌షిప్ ఉన్న ఉద్యోగులు ఎపికి వెళ్లిపోయారు. దీంతో వారి స్థానంలో సభ్యత్వం కావాలన్నఉద్యోగుల నుంచి కేవలం రూ.5 వందలతో పాటు కండీషన్ లెటర్‌ను తీసుకొని ఈ మెంబర్‌షిప్‌ను ఇస్తున్నాం. మెంబర్‌షిప్ కోసం లక్షల రూపాయలను తీసుకున్నట్టు ఎవరైనా ఆధారాలు ఇస్తే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం.