Friday, November 15, 2024

అలిశెట్టి ప్రభాకర్ యాదిలో!

- Advertisement -
- Advertisement -

‘ప్రపంచ మొక పద్మవ్యూహం, కవిత్వ మొక తీరని దాహం’ అన్న కొటేషన్ చదివినప్పుడు బహుశా శ్రీశ్రీ ఈ కవిని ఉద్దేశించి అన్నారేమో అన్న సందేహం కలగక మానదు. అతను ఒక కవిత్వ పిపాసి, తన కవితలతో మానవజాతిని జాగృతం చేయాలని నిరంతరం తపిస్తూఉండేవారు. తన కవిత్వ దాహం పూర్తిగా తీరకముందే అనారోగ్య సమస్యలతో అనంతలోకాలకి వెళ్లిపోయి, తన కవిత్వాలను జ్ఞాపకంగా మనకి వదిలేసి వెళ్లిన అతనే అలిశెట్టి ప్రభాకర్. ఈపేరు చెప్పగానే తెలియని సాహిత్యకారులు లేరంటే అతిశయోక్తి కాదు. తెలుగు సాహిత్యంలో ఇతని మజిలీ చెరగని ముద్ర వేసింది. బతికింది కొంతకాలమే కానీ తన రచనలతో చిరకాలం గుర్తుంది పోయేలా చిరంజీవి అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా జగిత్యాలలో అలిశెట్టి చినరాజాం, లక్ష్మీ అనే దంపతులకు 12 జనవరి 1954వ సంవత్సరంలో జన్మించారు. క్షయ వ్యాధి సోకి 12 జనవరి 1993లో తుదిశ్వాస విడిచారు. ఒక వ్యక్తికి జయంతి, వర్ధంతి రెండు ఒకే తేదీన రావటం చాలా అరుదు. ఇతను మొదట ఆర్టిస్ట్‌గా ఎదిగాడు.

ప్రారంభంలో పత్రికలకు పండగలు, ప్రకృతి, సినీనటుల బొమ్మలు వేసేవాడు. తరువాత జగిత్యాలలో సాహితీ మిత్రదీప్తి సంస్థ పరిచయంతో కవిత్వరంగంలోకి ప్రవేశించాడు. 1974లో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో వచ్చిన ‘పరిష్కారం’ అచ్చయిన మొదటి కవిత.నిరంతరం మనిషిలో పోరాట పటిమ కలిగి ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసంతో విజయకేతనం ఎగురవేయగలమని బలంగా నమ్మిన వ్యక్తి అలిశెట్టి ప్రభాకర్. వీరి కవిత్వంలో అంతుచిక్కని విషయాలు లేకుండా, మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి రాశాడు. సాహిత్య పరిజ్ఞానం లేని వ్యక్తులు సైతం అర్థం చేసుకునేలా ఉత్సాహభరితమైన కవిత్వం రచించాడు. ఉదాహరణకు ‘దృశ్యం’ అనే కవితలో శ్రమజీవుల కష్టాన్ని కళ్ళకు కడుతూ ఒక వాక్యం రచించాడు ‘పాలరాతి బొమ్మైనా, పార్లమెంటు భవనమైనా, వాడు చుడితేనే శ్రీకారం వాడు కడితేనే ఆకారం’అనే అంత్యానుప్రాసను ఉపయోగించి శ్రామిక సౌందర్యాన్ని పదాలలో అందంగా పొందుపరిచారు. ‘సిటీలైఫ్’ కవిత ద్వారా నగరాలలో ఉండే దుర్భర జీవితాన్ని ఆసాంతం తెలియజేశారు.

ప్రభాకర్ వ్యక్తిత్వపరంగా స్నేహశీలి, నిఖార్సయిన మనిషి నిరంతరం కష్టపడి పని చేసే కష్టజీవి. అందరికీ తెలిసిన వాడుక పదాలతోనే కవిత్వం అల్లడం తన ప్రత్యేకత. కుంచెకు రంగులద్ది బొమ్మలు గీయడం, కలంతో కవిత్వం రాయడం, కెమెరా లెన్స్‌లతో అందమైన ఫోటోలు తీయడమే తనకు తెలిసిన వృత్తి. ఎవరైనా మంచి పనిని తలపెడితే తన వంతు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందంజలో ఉండేవాడు.ఆపదలో ఉన్న తన స్నేహితులను చేరదీసేవాడు. తనలాంటి దీనంగా జీవించే పేద జీవితాలకు ఏనాటికైనా మంచి మార్గం దొరక్కపోతుందా! అంటూ నిత్యం కలలు కనేవాడు. ప్రభాకర్ మరణించే వరకు కూడా సామాజిక సమరంను స్వప్నిస్తూనే తన కలాన్ని ఝుళిపించాడు. ఏనాడూ సంపాదన కోసం ఆరాటపడలేదు. తన కళ ప్రజల కోసమే అని చివరి వరకు నమ్మాడు. పది మందికి ఉపయోగపడే కవిత్వం రాసి పాఠకులలో మంచి మార్పు తేవడం కోసం నిరంతరం ఆలోచనల మధ్య సంఘర్షణకు లోనయ్యాడు. తన కవిత్వంతో పాఠకులలో పఠన యోగ్యతకై నిరంతరం పరితపించాడు.

తన కవిత్వానికి వెన్నుదన్నుగా ఉండేలా కుంచెతో చిత్రాలను గీసి, సందర్భానికి తగిన బొమ్మల్ని కెమెరాలతో బంధిస్తూ చేర్చేవాడు. ఎంతో శ్రమించి తయారు చేసిన పోస్టర్ కవితలను తయారు చేసి వందల కొద్ది ప్రదర్శనకు పెట్టేవాడు. అర్థంకాని సంక్లిష్టమైన కవిత్వానికి ఒక కొత్త రూపం ఇచ్చి కవిత్వంలో సరళ పదాలు ఉపయోగించి కొత్త తరానికి నూతన శకాన్ని ఆరంభించిన ప్రయోగికుడు. సమాజాన్ని కవితా వస్తువుగా చేసుకొని తన కవితలను రాశాడు. ఆంధ్రజ్యోతి దినపత్రికలలో వరుసగా ఆరేళ్లపాటు ‘సిటీ లైఫ్’ పేరుతో దాదాపు 1425 కవితలు రాసి పంపాడు. ఈ దినపత్రికకు పంపిన కవితలలో ప్రజాదారణ పొందిన కొన్ని కవితలను ఎన్నుకొని 418 కవితలను ‘సిటీ లైఫ్’ పేరుతోనే 1992లో అచ్చు వేశాడు. ప్రభాకర్ కి తన చివరి రోజుల్లో ‘సిటీ లైఫ్’ కవితలపై వచ్చిన పారితోషకం మీదే కొన్నాళ్లు జీవించాడు. తన అనారోగ్యం పేదరికం వల్ల చాలా కవితలు అముద్రితంగానే మిగిలిపోయాయి.తన కవితలు ఏదైనా పత్రికలలో వస్తే కనీసం ఆ పత్రికను కొనే ఆర్థిక స్తోమత కూడా లేనంత దీనస్థితి కలిగిన జీవితాన్ని అనుభవించాడు.

రక్తరేఖ అనే కవిత్వ సంపుటిలో నేటి కాలపు పెట్టుబడిదారీ విద్యావ్యవస్థలో విద్యార్థుల స్థితిగతుల్ని ‘ఈ తరం క్రీస్తు కవిత’ లో ‘బలవంతంగా విద్యార్థుల్ని పుస్తకాలకి శిలువేసి సంవత్సరాల మేకులు దిగేసి వదిలేస్తే ఈ విద్యావ్యాపార వ్యవస్థలో నెత్తురోడుతున్న ఇంకెందరు నిరుద్యోగ క్రీస్తులో అన్నాడు. ‘సంక్షోభగీతం’ కవితా సంపుటిలో ఒక బాట ఒకచోట దేశ ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబించే రూపాలు గురించి అణ్వస్త్రల తెరపై కృత్రిమ శాంతి కపోతం ఎగిరి బుసలు కొట్టే డాలర్ విష సర్పం రూపాయి వదిలి అందంగా కనిపించింది అన్నాడు. అద్దె ఇంట్లో నివసించే వారికి యజమానికి మధ్య బంధం ‘సిటీ లైఫ్’ అనే కవితా సంపుటిలో ఇంటి యజమానులు ఎప్పటికీ కొట్టుడు పోనీ సరి, బేసి సంఖ్యలే. నగర జీవితం గురించి హైదరాబాద్ అనే మహావృక్షం మీద ఎవరికి వారే ఏకాకి అంటూ ఒకరికొకరు సంబంధం లేకుండా తమ జీవితాలను నెట్టుకు రావడం పరిపాటి. ‘మరణం నా చివరి చరణం కాదు’ కవితా సంపుటిలో మనుషుల్లో ఉన్న అచేతన తత్వాన్ని తట్టిలేపేలా ‘మార్చుకో’ అనే కవితలో ఆయుధం కొసమీద ఆదమరిచి నిద్రపోతున్నా వాడ….లే,

ఆయుధం బరువు కింద అణగారి బతుకుతున్న వాడా…..లే చుట్టూరా ముసురుకున్న ప్రమాద సూచికల్ని నువ్వు గోగుపూలనుకో మార్చుకో అంటూ మార్పుని కోరాడు. అలిశెట్టి ప్రభాకర్ కవిత్వం చూడడానికి రూపంలో సంక్షిప్తతని, వస్తువులో జీవిత విస్తృతిని సమాజపు లోతుల్ని ఇమిడ్చాడు. సమాజపు మార్పుని ఆకాంక్షించి పేదరికంలో మగ్గి బలైన ఆదర్శ కవి. శ్రీశ్రీ, జాషువా కవిత్వాల తర్వాత అంతగా ప్రజల్లోకి చొచ్చుకెళ్లిన కవిత్వం ఏదైనా ఉందంటే అలిశెట్టిదే అనడంలో అతిశయోక్తి లేదు. నిరంతరం సమాజ హితం కోరుతూ నూతన మార్పును ఆకాంక్షించి పేదరికం అంటే పేదరికంలోనే పరమపదిస్తూ ‘మరణం నా చివరి చరణం కాదు సమరమే నా అంతిమ చిరునామా’ అని ప్రకటించుకున్న స్నేహశీలి అలిశెట్టి. మనిషి కనుమరుగై పోవచ్చు కానీ తన కవిత్వం ద్వారా పాఠకుల హృదయాలలో అనునిత్యం స్మృతి పథంలో ఉంటారు. అలిశెట్టి ప్రభాకర్ రచనలలో తన కవిత్వం ద్వారా సమాజంలో నూతన మార్పు తేవడానికి

‘ఎర్రని పావురాల’కు ‘మంటల జెండాల’ను దివిటీలుగా కట్టి జీవిత పయనంలో దారి తప్పినవారికి ‘చురకలు’ వేస్తూ తన కవిత్వంతో ‘రక్తరేఖ’ను గీసి మానవ జీవితపు ‘సంక్షోభ గీతా’న్ని వినిపించి ‘సిటీ లైఫ్’ అయినా కానీ స్వేచ్ఛగా బతకాలని తన కవితల ద్వారా ఎప్పుడు స్ఫూర్తిని రగిలిస్తూనే ఉంటూ ‘మరణం నా చివరి చరణం కాదు’ అంటూ నిరంతరం మన వెంట ఉండే తీయని జ్ఞాపకాన్నవుతా అంటూ సుమధుర వచనాలను మన జీవితాలపై చల్లి దివికేగిన కవితా మూర్తిని స్మరించుకుంటూ..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News