Thursday, January 9, 2025

దోపిడీదారులపై అక్షర ఫిరంగి

- Advertisement -
- Advertisement -

మరణం నా చివరి చరణం కాదు.. అన్నట్టుగానే ఆయన మరణం కూడా ఆయన జన్మించిన రోజునే ముద్దాడింది. అందుకే ఆయన రచనలన్నీ సూటిగా ప్రశ్నల బాణం విసిరినట్లు ఉంటాయి. మానసిక మెదళ్లను కదలించడంతో పాటు చైతన్యానికి ఆయన అక్షరాలు సజీవ సాక్ష్యంగా నిలుస్తాయి. అక్షరాన్ని అమ్ముకోకుండా నిరంతరం దోపిడీ, అన్యాయాలపై ప్రశ్నించాయి. పేదరికాన్నైనా అనుభవించాడు కానీ.. ఆయన తన కలాన్ని ఎవరి వద్ద తాకట్టు పెట్టలేదు. సంపద కంటే సమాజ శ్రేయస్సే ముఖ్యమని అక్షరాలతో దోపిడీని, అవినీతిని నిలదీసిన వ్యక్తి అలిశెట్టి ప్రభాకర్. అక్షరాలను, సమాజాన్ని అంతలా ప్రేమించినందుకోనేమో ఆయన మరణం, జననం ఒకే తేదిన జరిగి అక్షర యోధునికి మరణం లేదన్నట్టుగా జయంతి, వర్ధ్దంతి ఒకే రోజు అయింది.

జీవితం అనే మినీ కవితలో మనిషి ప్రకృతిని చూసి ఎంతో నేర్చుకోవలసినది ఉందంటారు. చిన్నవిత్తనం నుంచి బయటకు వచ్చిన మొక్క, మానుగా మారి కొమ్మలు, రెమ్మలతో శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. ఆకాశం అంత ఎత్తును చూస్తుంది. అంతేకాదు, తాను సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆశ్రయించిన వారికి నీడ ఇస్తుంది. సమాజంలో పుట్టిన వ్యక్తి కూడా స్వార్థచింతన మానుకుని వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకుని తనకు, తన కుటుంబానికే కాక సమాజానికి ఉపయోగపడాలి అనే సందేశాన్ని ఎంతో తేలికైన మాటలతో చక్కగా వివరించారు. జీవితంలో నిరాశావాదానికి చోటులేదంటారు. వృక్షం స్వయంకృషికి ప్రతీక అంటారు అలిశెట్టి ప్రభాకర్.

అలిశెట్టి ప్రభాకర్ కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలలో 1956 జనవరి 12 న చినరాజం, లక్ష్మి దంపతులకు జన్మించాడు. అలిశెట్టికి ఏడుగురు అక్కాచెల్లెళ్ళు, ఇద్దరు అన్నదమ్ముళ్ళు. తండ్రి పరిశ్రమల శాఖలో పని చేస్తూ ఆకస్మికంగా మృత్యువాతపడ్డాడు. ఆయన మరణంతో 11 ఏళ్ల వయసులో ప్రభాకర్ కుటుంబ పోషణ బాధ్యతలు స్వీకరించాడు. ఆదర్శాలకు అనుగుణంగా పేదరాలయిన ‘భాగ్యం’ను పెళ్లి చేసుకొన్నారు. ఏనాడు సంపాదన కోసం ఆరాటపడని మనిషి. తన కళ ప్రజల కోసమే అని చివరి వరకు నమ్మాడు. చిత్రకారుడిగా, ఫోటో గ్రాఫర్‌గా వృత్తి జీవితాన్ని కొనసాగిస్తూనే, కవిగా ఎదిగాడు. 1982లో హైదరాబాదులో స్థిరపడ్డారు. సీరియల్‌గా సిటీలైఫ్ పేరుతో హైదరాబాద్ నగరంపై మినీ కవిత్వం రాశాడు. తన కవిత్వంతో పాఠకుల్లో ఆలోచనా దృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన అతి కొద్ది మంది కవుల్లో అలిశెట్టి ఒకరు.
అతని అక్షరం మండుతున్న అగ్నికణం.. ఆయన కవిత్వం ఓ పాశుపతాస్త్రం. సామాన్యుని కష్టాలే ఆ కలం కవితా వస్తువులు.. కష్టజీవి కన్నీళ్లే ఆ పెన్నుకు ఇంకు చుక్కలు.. తెలంగాణ సాహితీ వనంలో పూసిన ఆ ఎర్రమందారమే అలిశెట్టి ప్రభాకర్.. సరళమైన పదాలు.. రక్తం ఉడికించే మాటలతో మరఫిరంగుల్లాంటి కవితలు రాశారు. సాహసమనే నిప్పుల మీద కాలాన్ని ఫలంగా వండేందుకు నెత్తుటి ఊటేదో ఊపిరి తీసుకుంటుంది. కష్టాలనే సిరాగా నింపుకునే కలంగామారి పీడితుడే అణ్వస్త్రంగా, శత్రువే పాదధూళిగా కన్నీళ్లకు కర్తవ్యాన్ని నిర్దేశిస్తుంది. సమానత్వం కోసం దోపిడీ వటవృక్షాన్ని కూల్చేందుకు సైనికులతో కవాతు చేయిస్తుంది. అక్షరాలతో అగ్గిపుట్టిస్తుంది..

దోపిడీదారుల గుండె ల్లో విప్లవ కవిత్వాన్ని బాకులా దింపుతుంది. అందుకే ఆయుధాలుగా రూపాంతరం చెందుతోన్న ఆకలికి అలిశెట్టి ప్రభాకర్ కవిత్వమే నేపథ్యం. ఫోటోగ్రఫీపై ఉన్న ఇష్టంతో పూర్ణిమ స్టూడియో ప్రారంభించాడు ప్రభాకర్.. పెన్సిల్‌తో బొమ్మలు గీసేవారు. ప్రభాకర్ జీవితానికి సాహిత్యాన్ని పరిచయం చేసింది.. కొంతమంది మిత్రుల సూచనలతో కవితలకు సరిపోయే బొమ్మలు గీసి ఇచ్చిన ప్రభాకర్.. వాటి స్ఫూర్తితో కవిత్వం రాశాడు.. అలా 18 ఏళ్ల వయసులోనే బూర్జువా దోపిడీదారులపై కలాన్ని ఎక్కుపెట్టాడు. 1975లో పరిష్కారం పేరుతో అలిశెట్టి రాసిన కవిత తొలిసారి ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది.

ప్రభాకర్ గుండె లోతుల్లో అణచివేయబడ్డ బడబాగ్ని 1978లో జగిత్యాల జైత్రయాత్రతో ఉప్పెనలా బయటకొచ్చింది. పెత్తందారి వ్యవస్థ మీద పేదోళ్లు జరుపుతున్న పోరుతో ప్రభాకర్ లోని అక్షర సూరీడు కొత్త దిక్కున ఉదయించాడు. అందుకే జైత్రయాత్రలో ప్రజల ఉరకలెత్తే ఉత్సాహాన్ని చూసి తనలోని ఆవేశాన్ని ఎర్ర పావురాలుగా ఎగరేశాడు. ఆనాటి నుంచి ఏనాడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు.

అల్పాక్షరాలతోనే అనల్పార్థాన్ని ఇచ్చే నానీలనే మినీ కవిత్వంతో తెలుగు సాహితీ లోకంలో అలజడి సృష్టించాడు. అక్షరాలతోనే సమరశంఖం పూరిస్తున్న ప్రభాకర్‌పై ప్రభుత్వాలు, పోలీసులు, భూస్వాములు కక్ష కట్టారు. ఫలితంగా నిర్బంధం నీడలా వెంటాడింది.. అందుకే జగిత్యాల నుంచి కరీంనగర్‌కు షిఫ్ట్ అయ్యాడు. బతకడంకోసం శిల్పిస్టూడియో ప్రారంభించాడు. 1979లో “మంటల జెండాలు” సంకలనాన్ని వెలువరించాడు. అందులో వచ్చిన దోపిడీ చిహ్నం, దశ, పింజర లాంటి ఎన్నో కవితలకు ఇండియన్ ఇంక్‌తో అద్భుతమైన చిత్రాలు గీశాడు.
ఓ వైపు ఫోటోలు తీస్తూనే.. ఇంకోవైపు కవితలు రాశాడు. మరోవైపు బొమ్మలు కూడా గీశాడు. తనలోని భావాలకు చిత్రరూపమిచ్చి వాటితోనే చిత్ర కవితలు రాశాడు. ఆ ప్రక్రియ అప్పట్లో పెద్ద సంచలనం. 1981లో ‘చురకలు’ కవితా సంకలనాలను పీడితుల పక్షాన సంధించాడు. వ్యంగ్యం, పదును, విమర్శ, సామాజిక స్పృహ లాంటివన్నీ ఒకేసారి చురకల్లో కనిపిస్తాయి. ప్రజల కోసం, వారి బతుకులు బాగు చేయడానికి వారి బాధలు ప్రపంచానికి తెలియచేయడానికే కవిత్వమని నమ్మిన ప్రభాకర్ అందు కోసం అహర్నిశలు శ్రమించాడు..

“తను శవమై.. ఒకరికి వశమై.. తనువు పుండై.. ఒకడికి పండై.. ఎప్పుడూ ఎడారై.. ఎందరికో ఒయాసిస్సై” అంటూ సెక్స్‌వర్కర్ల దుర్భర జీవితాన్ని ప్రపంచానికి చాటాడు ప్రభాకర్. నాలుగు వాక్యాల్లోనే ఆ అభాగ్యుల జీవన వేదనను కళ్లకు కట్టినట్టు ఒక్క అలిశెట్టి తప్ప ఇంకెవరు ఇప్పటికీ చెప్పలేకపోయారు.

మరణం నా చివరి చరణం కాదని ప్రకటించిన ప్రభాకర్.. కబళించే మృత్యువును ముందే గుర్తించాడు. తెరవెనక లీలగా మృత్యువు కదలాడినట్టు తెరలుతెరలుగా దగ్గొస్తుంది. తెగిన తీగెలు సవరించడానికన్నట్టు గబగబా పరిగెత్తుకొచ్చి నా భాగ్యం గ్లాసెడు నీళ్లందిస్తుందని పర్సనల్ పోయెం అనే కవితలో రాసుకున్నాడు. చివరి రోజుల్లో పేదరికంతో పోరాటం చేసిన ప్రభాకర్.. పైసల కోసం దారి తప్పలేదు. ఆయన రాసిన కవితల్ని సినిమాలకు అమ్ముకునే అవకాశమచ్చినా ఒప్పుకోలేదు.. సినిమా కవిగా మారి ఉంటే ఎంతో డబ్బు, పేరు సంపాదించేవాడు. కాని, సమాజం కోసమే రాస్తానన్న మాటలకు చివరి శ్వాసవరకు కట్టుబడి ఉన్నాడు. ఫలితంగా అనారోగ్యానికి చికిత్స చేయించుకోవడానికి కూడా డబ్బులు లేక 1993 జనవరి 12న హైదరాబాద్‌లో చనిపోయాడు. మరణం నా చివరి చరణం కాదు అంటూ ఎంతో చైతన్యం అక్షరం అయిన అలిశెట్టి ప్రభాకర్ పుట్టిన రోజు, చనిపోయిన రోజు ఒకటే అయింది. సమాజాన్ని కుటుంబంగా భావించిన అలిశెట్టి ప్రభాకర్ అక్షర స్ఫూర్తిని నేటి యువత అలవరుచుకోవాల్సిన అవసరం ఉంది.

సంపత్ గడ్డం
7893303516

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News