దుబాయి : యుఎఇ వేదికగా జరుగనున్న ఆసియాకప్ టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లికి కీలకంగా మారింది. కొంత కాలంగా వరుస వైఫల్యాలు చవిచూస్తున్న కోహ్లికి ఈ టోర్నీ సవాల్‌గా తయారైంది. ఈసారైనా కోహ్లి మెరుగైన బ్యాటింగ్‌ను కనబరుస్తాడా లేదా అనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఒక మాటలో చెప్పాలో ఆసియాకప్‌లో అందరి దృష్టి విరాట్ కోహ్లిపైనే నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
రానున్న ప్రపంచకప్ నేపథ్యంలో కోహ్లి గాడిలో పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోహ్లి పూర్వవైభవం సాధిస్తేనే మెగా టోర్నీలో టీమిండియాకు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అంతేగాక కొంతకాలంగా తనపై వస్తున్న విమర్శలకు పుల్‌స్టాప్ పెట్టాల్సిన బాధ్యత కూడా కోహ్లిపై ఉంది. విమర్శకులకు తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాల్సిన అవసరం విరాట్‌కు ఏర్పడింది. ఒకసారి కోహ్లి ఫామ్‌ను అందుకుంటే అతన్ని ఆపడం ఎవరి తరం కాదనే విషయాన్ని అందరు గుర్తుంచుకోవాలి. కొన్నేళ్ల క్రితం వరకు ప్రపంచ క్రికెట్‌లోనే కోహ్లికి సరితూగే బ్యాట్స్‌మన్ ఎవరూ కనిపించలేదు.
కానీ కొంతకాలంగా కోహ్లి మూడు ఫార్మాట్‌లలోనూ వరుస వైఫల్యాలు చవిచూస్తున్నాడు. అతని వైఫల్యం జట్టుకు సమస్యగా మారింది. పేలవమైన ఫామ్ కారణంగా కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకోవాల్సి వచ్చింది. పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో తుది జట్టులో స్థానం సంపాదించడం కూడా కోహ్లికి ఇబ్బందిగా మారినా ఆశ్చర్యం లేదు.