కరీంనగర్: కరీంనగర్ జిల్లాకే తలమాణికంగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి ప్రారంభ వేడుకలలో ఎటువంటి లోపాలు లేకుండా పకడ్బందీగా జరగాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అధికారులను, నిర్వాహకులను ఆదేశించారు. ఈ నెల 21న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చే ప్రారంభించనున్న కేబుల్ బ్రిడ్జీ ప్రారంభ ఏర్పాట్లను పోలీస్ కమిషనర్, ఇతర అధికారులు,నిర్వాహకుల తో కలిసి జిల్లా కలెక్టర్ ఆదివారం పరిశీలించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, వేడుకలలో స్టేజి ఏర్పాటు మొదలు పార్కింగ్ వరకు ప్రతిఒక్కటి పకడ్బందీగా జరగాలని సూచించారు. ప్రవేశం నుంచి తిరిగి బయటకు వెళ్లేవరకు లోటుపాట్లు లే కుండా చూడాలని, స్టేజి నుండి పార్కింగ్ వరకు ఇరువైపు బ్యారికేడింగ్ ను ఏర్పాటు చేయాలని, విద్యుత్ లైట్లను ఏర్పాటు చేయాలని తెలిపారు.
అనంతరం మంచినీళ్ల పండుగ కార్యక్రమంలో భాగంగా కొత్తపల్లి మండలం ఎలగందల్ లోని 6యంఎల్డి ఫిల్టర్ హౌజ్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిపి సుబ్బారాయుడు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎసిపి తులశ్రీనివాస్, కరీంనగర్ ఆర్డిఓ ఆనంద్ కుమార్, ఇతర పోలీస్ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గోన్నారు.