మన తెలంగాణ/హైదరాబాద్: హజ్ యాత్ర చాలా పవిత్రమైందని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఏటా ఈ యాత్ర విజయవంతంగా ముగిసేందుకు అవసరమైన నిధుల కేటాయింపుతో పాటు అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. హజ్ యాత్ర ఈ నెల 20నుండి 30వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. హజ్ యాత్ర మొదలవుతున్న సందర్భంగా హజ్ కమిటి బుధవారం నాంపల్లి హజ్ భవన్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసింది. మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎకె ఖాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ ఈ ఏడాది హజ్ యాత్రకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సుమారు 3,500 మంది భక్తులు హైదరాబాద్ విమానాశ్రయం నుండి హజ్‌కు బయలు దేరుతారని తెలిపారు. వారంతా జులై 28 నుంచి ఆగష్టు 6 వరకు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా, చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి అధికారులకు సూచించారు. మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ గొప్ప సెక్యులర్ నాయకుడని అన్నారు. మైనారిటీలు ఎటువంటి అభద్రతకు లోను కాకుండా ప్రశాంతంగా జీవిస్తున్నారన్నారు. హజ్ యాత్ర విజయవంతంగా ముగిసేందుకు మరింత బాధ్యతతో వ్యవహరించాలని అధికారులను కోరారు. సమావేశంలో హజ్ కమిటి చైర్మన్ సలీం, మైనారిటీ శాఖ కార్యదర్శి అహ్మద్ నదీమ్, హజ్ కమిటి సిఇఓ షఫిఉల్లా, ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటి చైర్మన్ షేక్ గౌస్, హైదరాబాద్ సిటి జాయింట్ కమిషనర్ రంగనాథ్, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
All Arrangements Completed for Haj Yatra: Koppula Eshwar