సిద్దిపేట జిల్లా చేర్యాలలోని శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి కల్యాణం, జాతరలను తెలంగాణ ఆధ్యాత్మిక సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా వైభవోపేతంగా నిర్వహించాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. వేలాదిగా జాతరకు తరలివచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని ఏ చిన్న పొరపాటు తలెత్తకుండా పటిష్టమైన కార్యాచరణతో ఏర్పాట్లు చేయాలని మంత్రి సురేఖ అధికారులకు సూచించారు. గురువారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయం దేవాదాయ ధర్మాదాయ మంత్రిత్వశాఖ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో మంత్రి సురేఖ సిద్దిపేట జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, సిద్దిపేట కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి, సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఉన్నతాధికారులు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ,
సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) అబ్దుల్ హమీద్, ఆర్డివో, కొమురవెల్లి ఆలయ ఏఈఓ శ్రీనివాస్, ఆర్టిసి డిపో మేనేజర్, డిఎంహెచ్‌ఓ, డిపిఓ, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది,గ్రామీణ నీటి సరఫరా, ఫైర్, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ తదితర శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ గత సంవత్సరం కంటే మరింత వైభవోపేతంగా మల్లికార్జున స్వామివారి కల్యాణం, జాతరను నిర్వహించనున్నట్లు మంత్రి సురేఖ తెలిపారు. డిసెంబర్ 29 ఉదయం 10.45 గంటలకు శ్రీ మల్లికార్జున స్వామి వారి కల్యాణాన్ని, జనవరి 19 నుండి 10 వారాలపాటు మార్చి 24 వరకు జాతరను నిర్వహించేందుకు నిర్ణయించినట్లు మంత్రి సురేఖ ప్రకటించారు. ఈ దిశగా భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేయాలని పోలీస్, విద్యుత్, వైద్యారోగ్యం, ఆర్టీసి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి సరఫరా, ఆర్ అండ్ బి తదితర శాఖల అధికారులను మంత్రి సురేఖ ఆదేశించారు. భక్తులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కల్యాణాన్ని వీక్షించి,
స్వామి అమ్మవార్లను దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యేలా వీలుగా అన్ని శాఖల సమన్వయంతో వ్యవహరించేలా చర్యలు చేపట్టాలని మంత్రి సురేఖ కలెక్టర్ ను నిర్దేశించారు. గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కల్యాణ వేదికను విశాలంగా తీర్చిదిద్దాలని ఈవోను మంత్రి సురేఖ ఆదేశించారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అమ్మవార్లు బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలకు కిరీటాల తయారీ పనుల పై మంత్రి సురేఖ ఆరా తీశారు. రూ. 9.776 కోట్లు ఎస్డిఎఫ్ నిధులు, రూ. 36.18 కోట్ల దేవాదాయ శాఖ నిధులతో చేపడుతున్న కార్యక్రమాలను ఈవో మంత్రి సురేఖకు వివరించారు. కిరీటాల తయారీ పనులు పురోగతిలో ఉన్నట్ల్లు తెలిపారు. ప్రతి రోజూ స్వామివారికి అలంకరించే పూలను తదనంతరం పడేయకుండా అగర్‌బత్తీలు తయారుచేసే సాంకేతికతను వాడుకుని దేవాలయ అవసరాలకు వినియోగించుకోవాలని మంత్రి సురేఖ ఈవోను నిర్దేశించారు.
భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు : ఎల్లమ్మ దేవాలయంలో మొక్కులు సమర్పించుకునే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు కల్యాణోత్సవానికి, జాతరకకు పెద్ద సంఖ్యలో తరలివచ్చే పరిస్థితులున్నందున ఈ దిశగా చర్యలు చేపట్టాలని సిద్దపేట డిపో మేనేజర్ కు మంత్రి సురేఖ సూచించారు. భక్తుల క్యూలైన్లు, బారికేడ్లు, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు, సిసి కెమరాల నిఘా, వివిఐపిలకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు, భక్తులకు దారులను తెలిపేలా సైన్ బోర్డులు, తాగునీటి సదుపాయం, మెడికల్ క్యాంపు, లాక్టేషన్ గదులు తదితర ఏర్పాట్లు చేయాలని మంత్రి సంబంధిత అధికారులకు సూచించారు. జాతర సమయానికి వేసవి కాలం రానుండటంతో భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, నడిచే మార్గాల్లో మ్యాట్లు, వృద్ధులు, వికలాంగులు, గర్భిణులకు బ్యాటరీ వాహనాలు తదితర ఏర్పాట్లు చేయాలన్నారు.