భద్రాద్రి కొత్తగూడెం : ఊరూరా చెరువుల పండుగ ప్రతీ ఊరులో జరిగేపెద్ద పండుగని అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా నేడు నిర్వహించనున్న సాగునీటి దినోత్సవం, 8వ తేదీన జరగనున్న ఊరూరా చెరువల పండుగ, 18వ తేదీన నిర్వహించనున్న తెలంగాణ మంచినీళ్ల పండుగ కార్యాక్రమాల నిర్వహణపై మంగళవారం ఐడివోసి కార్యాలయం నుంచి ఇరిగేషన్, పంచాయతీరాజ్, మత్సశాఖ, పశు సంవర్థక, వైద్య, రెవెన్యూ, మునిసిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, సర్పంచులు, ఎంపీపీలు, ఎంపిటిసిలు, జడ్‌పిటిసిలు, కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీ బుధవారం నిర్వహించే సాగునీటి దినోత్సవం కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలో చుంచుపల్లి మండలంలోని విద్యానగర్ బైపాస్ రోడ్డులో ఉన్న భువన్ గార్డెన్స్‌లో జరుగుతుందని ,దీనికి ఇరిగేషన్ ఈఈ అర్జున్ ప్రత్యేక అధికారిగా ఉంటారని చెప్పారు. అశ్వారావుపేట నియోజకవర్గానికి సురేష్‌కుమార్ ఇరిగేషన్ ఈఈ ఉంటారని, కార్యాక్రమం అగ్రికల్చర్ మార్కెడ్ యార్డ్ దమ్మపేటలో జరుగుతుందని అన్నారు. ఇల్లందు నియోజకవర్గానికి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఇరిగేషన్ డివిజన్ ప్రత్యేక అదికారిగా ఉంటారని, ఇల్లందుపాడు చెరువు వద్ద జరుగుతుందని చెప్పారు.
ఊరూరా చెరువుల పండుగ కార్యాక్రమంలో ప్రతీ గ్రామం నుంచి ప్రజలు బతుకమ్మలు, బోనాలతో ఊరేగింపుగా చెరువుకట్టకు చేరుకోవాలని తెలిపారు. మత్సకారుల వలలతో రావాలనిచెప్పారు. చెరువు కట్ట వద్ద కట్టమైసమ్మ పూజలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 481 గ్రామ పంచాయతీలుండగా 401 పంచాయతీల్లో చెరువులున్నాయని, వాటిలో 50 మారుమూల గ్రామాల్లో ఉన్నాయని, అవి కాకుండా 351 గ్రామ పంచాయతీల్లో ఊరూరా చెరువు పండుగకు అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్సుల్లో ఇరిగేషన్ ఎస్‌ఈలు వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, డిఆర్డీవో మధుసుదన్‌రాజు, డిపిఒ రమాకాంత్, జడ్‌పి సిఇఒ విద్యాలత, వైద్యాధికారి శిరీష, ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ రవిబాబు, మైనార్టీ సంక్షేమ అధికారి సంజీవరావు, మునిసిపల్ కమిషనర్లు, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపిఒలు, సర్పంచులు, ఎంపీపీలు, జెడ్‌పిటిసిలు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.