హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రూప్ 4 పరీక్ష నిర్వహణకు టిఎస్‌పిఎస్‌సి సర్వం సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం(జులై 1) నిర్వహించనున్న గ్రూప్ 4 పరీక్షకు 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కమిషన్ తగిన చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే గ్రూప్ 4 హాల్‌టికెట్లు జారీ చేసిన టిఎస్‌పిఎస్‌సి అభ్యర్థులు కొన్ని కీలక సూచనలు చేసింది.
1 .గ్రూప్ 4 పరీక్ష ప్రారంభం కావడానికి 15 నిమిషాల ముందే గేట్లు మూసివేస్తారు. అందువల్ల నిర్ణీత సమయానికి ముందే అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి.
2. పేపర్ -1 (జనరల్ స్టడీస్) ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, పేపర్- 2 (సెక్రటేరియల్ ఎబిలిటీస్) మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. అందువల్ల పేపర్-1కు ఉదయం 8 గంటల నుంచి, పేపర్- 2కు మధ్యాహ్నం ఒంటి గంట నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా సకాలంలో చేరుకోండి.
3. అభ్యర్థులు పరీక్ష కేంద్రంలో ప్రవేశించే ముందు భద్రతా సిబ్బందికి, పరీక్ష గదిలోకి చేరుకున్నాక ఇన్విజిలేటర్‌కు ఫొటో గుర్తింపుకార్డు చూపించాలి. క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు.
4. అభ్యర్థికాకుండా వేరే వ్యక్తులు హాజరైనట్లు గుర్తిస్తే పోలీసు కేసు నమోదు చేయడంతో పాటు ఆ అభ్యర్ధిని పరీక్షలకు అనర్హుడిగా ప్రకటిస్తారు.
5. ఈ పరీక్షకు భారీగా అభ్యర్థులు హాజరు కానుండటంతో ఈసారి వేలిముద్రను తప్పనిసరి చేశారు. నామినల్ రోల్‌లో సంతకం తరువాత ఎడమచేతి బొటన వేలిముద్ర కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు.
6. ప్రతి సెషన్ పరీక్ష ముగిశాక ఒఎంఆర్ షీట్‌ను ఇన్విజిలేటర్‌కు అందజేసి వేలిముద్ర వేయాలి. అరగంటకోసారి అభ్యర్థులకు సమయాన్ని గుర్తుచేస్తూ బెల్ మోగిస్తారు. పరీక్ష ముగియడానికి 5 నిమిషాల ముందు బెల్ మోగిస్తారు.
7. అభ్యర్థులు ప్రశ్నపత్రంపై సమాధానాలను మార్క్ చేయకూడదు. గ్రూప్-4 ఒఎంఆర్ పత్రంలో హాల్ టికెట్, ప్రశ్నపత్రం నెంబరు, పరీక్ష కేంద్రం కోడ్, అభ్యర్థి పేరుతో పాటు సంతకం చేయాలి.
8. ఓఎంఆర్ పత్రంలో బ్లూ లేదా బ్లాక్ పెన్‌తో పేరు, కేంద్రం కోడ్, హాల్‌టికెట్, ప్రశ్నపత్రం నెంబరు రాయాలి.