Saturday, November 9, 2024

రోహిత్‌కు తేలికేం కాదు..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/క్రీడా విభాగం: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా పూర్తి స్థాయి కోచ్‌గా రోహిత్ శర్మను నియమిస్తూ ఇటీవలే భారత క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లిని తప్పించి రోహిత్ శర్మను వన్డే కెప్టెన్‌గా నియమించారు. దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌లో రోహిత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే ఐపిఎల్‌తో పోల్చితే టీమిండియా కెప్టెన్సీ చాలా భిన్నమైందనే విషయాన్ని రోహిత్ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సీనియర్లు, జూనియర్ ఆటగాళ్ల కలయికతో ఉండే టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించడం సులువేమీ కాదు. గతంలో సచిన్ వంటి దిగ్గజానికే కెప్టెన్సీ నిర్వహించడం సాధ్యం కాలేదు. దీంతో అతను మధ్యలోనే సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోక తప్పలేదు. విరాట్ కోహ్లితో పోల్చితే రోహిత్ శర్మకు కెప్టెన్సీలో మంచి అనుభవమే ఉంది. ఐపిఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు పలుసార్లు ట్రోఫీని అందించిన కెప్టెన్‌గా రోహిత్ పేరు తెచ్చుకున్నాడు.

అంతేగాక కోహ్లి గైర్హాజరీలో పలుసార్లు టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించి ఎన్నో విజయాలు అందించాడు. అయితే పూర్తిస్థాయి కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తించడం మాత్రం అంత తేలికకాదని విశ్లేషకులు అంటున్నారు. భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఆదరణ నేపథ్యంలో ఒక్క ఓటమి కూడా కెప్టెన్సీ నిర్వహణకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. గతంలో విజయవంతమైన కెప్టెన్లుగా పేరు తెచ్చుకున్న అజారుద్దీన్, గంగూలీ, ధోనీ, ద్రవిడ్ తదితరులకు ఇలాంటి పరిస్థితి తప్పలేదు. దీంతో రోహిత్ ఏమాత్రం విఫలమైనా అతనికి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో టి20, వన్డే ప్రపంచకప్‌లు జరుగనున్నాయి. అంతేగాక ఆసియా కప్ వంటి మరో మెగా టోర్నమెంట్ కూడా జరగాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పరిమిత ఓవర్ల కెప్టెన్సీని నిర్వహించడం రోహిత్‌కు ఒక సవాల్‌గానే చెప్పొచ్చు.
తక్కువ అంచనా వేయలేం..
అయితే ఐపిఎల్‌లో విజయవంతమైన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న రోహిత్ శర్మను తక్కువ అంచనా వేయలేం. జట్టును విజయపథంలో నడిపించే సత్తా అతనికుంది. అందుకే ఎంతో కీలకమైన బాధ్యతలను బిసిసిఐ రోహిత్‌కు అప్పగించిందని గుర్తుంచుకోవాలి. ఇక రోహిత్ కూడా తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. రానున్న రోజుల్లో టీమిండియాకు విజయాలు అందించి తన సత్తా చాటాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. అంతేగాక చాలా కాలంగా అందని ద్రాక్షగా ఉన్న వరల్డ్‌కప్ ట్రోఫీ లోటును తీర్చాలని తహతహలాడుతున్నాడు.

All eye put on Rohit Sharma Captaincy in ODI

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News