సీతారాం ఏచూరి పిలుపు
కోల్‌కత: హిందుత్వ రాష్ట్ర ప్రచారకర్తలను ఓడించడానికి లౌకిక ప్రాంతీయ పార్టీలతోపాటు పర్యావరణ, దళిత హక్కుల కార్యకర్తలతోసహా రాజకీయేతర శక్తులను ఏకం చేయాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. తొలుత రాష్ట్ర స్థాయిలో బిజెపి ఓడించేందుకు కృషి చేసి ఆ తర్వాత జాతీయ ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. సోమవారం నాడిక్కడ సిపిఐ 103వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళిత ఉద్యమాలు, పర్యావరణ హక్కుల ఉద్యమాలు వంటి వివిధ సమస్యలపై పోరాడుతున్న ప్రజా ఉద్యమకారులను ఏకం చేయడం ద్వారా వామపక్ష, ప్రజాస్వామిక శక్తులను బలోపేతం చేయాలని అన్నారు. మతతత్వ విషశక్తులను ఓడించడానికి హక్కుల కార్యకర్తలతోపాటు లౌకిక పార్టీలన్నీ చేతులు కలపాలని ఆయన సూచించారు. బీహార్, ఉత్తర్ ప్రదేశ్‌లో లౌకికవాద శక్తులకు విజయావకాశాలు అధికంగా ఉన్నాయని, కాని తృణమూల్ కాంగ్రెస్ పాలిత పశ్చిమ బెంగాల్‌లోనే కొన్ని అవరోధాలు ఉన్నాయని ఏచూరి అభిప్రాయపడ్డారు. బెంగాల్‌లో బిజెపి కాలు మోపేందుకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీయే అవకాశం కల్పించిందని ఆయన విమర్శించారు.