Tuesday, December 24, 2024

చట్టాలన్నీ ఒక గ్రంథంగా అందుబాటులోకి…

- Advertisement -
- Advertisement -

దాదాపుగా 300 చట్టాలతో కూడిన పుస్తకాలు త్వరలోనే అన్ని శాఖలకు అందజేత
చట్టాల ఆధారంగానే ప్రభుత్వ పాలన
ఉమ్మడి రాష్ట్రంలోని 287 చట్టాలను అన్వయించుకున్న రాష్ట్ర ప్రభుత్వం

All laws are available as book

మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్ర ప్రభుత్వ చట్టాలన్నీ త్వరలోనే ఒక గ్రంథంగా అందుబాటులోకి రానున్నాయి. ఉమ్మడి రాష్ట్రం నుంచి అన్వయించుకున్న చట్టాలతో పాటు తెలంగాణ ఆవిర్భావం అనంతరం చేసిన చట్టాలను న్యాయశాఖ క్రోడీకరించింది. దాదాపుగా 300 చట్టాలతో కూడిన పుస్తకాలు త్వరలోనే అన్ని శాఖలకు అందుబాటులోకి తీసుకు రానున్నాయి. చట్టాల ఆధారంగానే ప్రభుత్వ పాలన జరుగుతుంది. చట్టాలకు లోబడి ప్రభుత్వాలు వివిధ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తుంటాయి. అవసరం మేరకు కొత్త చట్టాలు చేయడం సాధారణమే. అవసరం లేదనుకున్నప్పుడు ఉన్న చట్టాలను కూడా రద్దు చేస్తుంటారు. ఈ ప్రక్రియ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో ఉమ్మడి రాష్ట్రంలోని చట్టాలను అన్వయించుకునే వెసులుబాటును విభజన చట్టంలో పొందుపరిచారు. దాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఉమ్మడి రాష్ట్రంలోని 287 చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం అన్వయించుకొంది.

అవసరాలకు అనుగుణంగా…

విభజన చట్టంలో ఇచ్చిన వెసులుబాటు ప్రకారం అవన్నీ కూడా తెలంగాణకు వర్తించాయి. ఇదే సమయంలో రాష్ట్రానికి అవసరం లేదని ప్రభుత్వం భావించినా వంద చట్టాలను కూడా రిపీల్ చేసింది. దీంతో ఆయా చట్టాలు ఉనికిలో లేకుండా పోయాయి. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తెలంగాణ అవసరాలకు అనుగుణంగా కొత్త చట్టాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. టిఎస్‌ఐపాస్, టిఎస్ బీపాస్, పురపాలక, పంచాయతీరాజ్, భూసేకరణ, పట్టాదారు పాసుపుస్తకాలు, ఆర్‌ఓఆర్, ఎస్సీ-, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి, ఇలా పలు కొత్త చట్టాలు వచ్చాయి.

దాదాపుగా 30 కొత్త చట్టాలు…

ఏడున్నరేళ్లుగా దాదాపు 30 వరకు కొత్త చట్టాలను ప్రభుత్వం చేసింది. అయితే పాత చట్టాలను అన్వయించుకునప్పటికీ వాటిని పూర్తిస్థాయిలో తెలంగాణ అని ప్రస్తావిస్తూ మార్పులు చేయలేదు. ఇదే సమయంలో వివిధ కొత్త చట్టాలు కూడా వచ్చాయి. దీంతో అన్నింటినీ క్రోడీకరించి వాటిని గ్రంథస్థం చేసే పనికి న్యాయశాఖ శ్రీకారం చుట్టింది. 2018 నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చట్టాలు, వాటిలో రాష్ట్రం అన్వయించుకున్నవి, రద్దు చేసినవి, కొత్తగా చేసిన చట్టాలన్నింటినీ క్రోడీకరించారు. ఈ ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది. ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమించారు.

చివరిసారిగా 1998లో…

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చివరి సారిగా 1998లో చట్టాలను గ్రంథస్థం చేశారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ ప్రయత్నం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన కసరత్తు పూర్తయింది. దీంతో దాదాపు 300 వరకు అన్ని చట్టాలు ఒకే దగ్గర అందుబాటులోకి వచ్చాయి. రెండు వాల్యూమ్‌లను ముద్రించి అన్ని శాఖల్లో చట్టాల సంపుటిని అందుబాటులో ఉంచనున్నారు. తద్వారా చట్టాలకు సంబంధించి ఎలాంటి అయోమయం లేకుండా పాలనా వ్యవహారాలు సాగేందుకు సులువుగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News