Thursday, January 23, 2025

అన్ని వైద్య సేవలూ జిల్లాల్లోనే

- Advertisement -
- Advertisement -

All medical services are in the districts: Harish rao

అనవసరంగా హైదరాబాద్ ఆసుపత్రులకు రెఫర్ చేయవద్దు
సిజేరియన్లు గణనీయంగా తగ్గాలి
ఇఎన్‌టి, డెర్మటాలజీలు మెరుగుపరచాలి
డిఎంఇ ఫీల్డ్ విజిట్ చేయాలి :
వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు
వైద్య విద్య పరిధిలోని ఆసుపత్రుల పనితీరుపై మంత్రి వీడియో సమీక్ష

మనతెలంగాణ/హైదరాబాద్ : జిల్లా స్థాయిలోనే అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో అక్కడే అత్యవసర సేవలు అందించేలా చూడాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు సూచించారు. అనవసరంగా హైదరాబాద్ ఆసుపత్రులకు రెఫర్ చేయవద్దని తెలిపారు. అత్యవసర కేసులను తమ వద్దకే పంపాలని ఆసుపత్రులు తమ పరిధిలోని ఆసుపత్రులకు సూచించాలని పేర్కొన్నారు. బోధనాసుపత్రుల్లో అందే వైద్య సేవల గురించి అవగాహన కల్పించాలని చెప్పా రు. శనివారం వైద్య విద్య పరిధిలోని ఆసుపత్రుల పనితీరుపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, డిఎంఇ రమేష్ రెడ్డి, సిఎం ఒఎస్‌డి గంగాధర్, అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లు, హెచ్‌ఒడిలు, ఆర్‌ఎంఒలు, సిఎస్ ఆర్‌ఎంఒలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గత సమావేశాల్లో ఏర్పరుచుకున్న లక్ష్యాల సాధన, సాధించిన పురోగతి తదితర అంశాలపై సమీక్షించారు. ఆసుపత్రులు, విభాగాల వారీగా సంబంధిత విభాగాధిపతులతో మాట్లాడారు. ప్రజలకు మరింతగా నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజలకు మంచి చేయడమే తమ లక్షమని స్పష్టం చేశారు. ప్రతి నెలా రివ్యూ ఉంటుందని, వైద్యులు, సిబ్బంది రిపోర్టులతో సిద్ధంగా ఉండాలని చెప్పారు. ప్రసూతి, ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ సహా అన్ని విభాగాల్లో ఆరోగ్య శ్రీ కింద మరింత ఎక్కువగా సేవలు చేయాలని అన్నారు. ప్రణాళిక రూపొందించుకొని ఆపరేషన్ థియేటర్ వినియోగం పెంచాలని చెప్పారు. సీ -సెక్షన్లు గణనీయంగా తగ్గించి, సాధారణ ప్రసవాలు ఎక్కువ జరిగేలా చూడాలని తెలిపారు. ఇఎన్‌టి, డెర్మటాలజీ సేవలను మరింత మెరుగుపరచాలని పేర్కొన్నారు. ఆసుపత్రుల సమీప గ్రామాల్లో ఇఎన్‌టి క్యాంపులు ఏర్పాటు చేసి సేవలు అందించాలని అన్నారు. వైద్య విద్య సంచాలకులు(డిఎంఇ) అన్ని ఆసుపత్రులకు వెళ్లి ఫీల్డ్ విజిట్ చేయాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.

అత్యవసర సేవలు అన్ని వేళలా అందించేందుకు వీలుగా అనస్థీషియా విభాగం క్రియాశీలకంగా ఉండాలని మంత్రి పేర్కొన్నారు. వారానికి ఒక విభాగం వారీగా సూపరింటెండెంట్లు సమీక్షలు నిర్వహించాలని సూచించారు. వారం వారం పురోగతిని మెరుగుపడేలా చూడాలని దిశానిర్ధేశం చేశారు. పీడియాట్రిక్ విభాగంలోనూ ఆరోగ్య శ్రీ రిజిస్ట్రేషన్లు పెరగాలని చెప్పారు. ఎన్‌ఐసీయూ, పీఐసీయూ సేవలు అందేలా చూడాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరోగ్య శాఖ బడ్జెట్‌ను గత ఏడాదితో పోల్చితే రెట్టింపు చేశారని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని చేరువ చేస్తున్నదని, ప్రభుత్వ ప్రోత్సాహానికి తోడు, వైద్యులు, సిబ్బంది కృషి చేసి సిఎం కెసిఆర్ కలలుగన్న ఆరోగ్య తెలంగాణ కలను సాకారం చేయాలని మంత్రి హరీశ్‌రావు కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News