Sunday, December 22, 2024

పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికపై ప్రధాన పార్టీల దృష్టి

- Advertisement -
- Advertisement -

ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పార్టీలు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు ముగిసిపోవడంతో ఇప్పుడు ప్రధాన పార్టీల దృష్టి పట్టభద్రుల ఎంఎల్‌సి ఉపఎన్నికపై పడింది. ఈనెల 27న జరగబోయే వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. 2021 మార్చిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ స్థానానికి ఎంఎల్‌సిగా ఎన్నికయ్యారు. 2027 మార్చి వరకు ఆయన పదవీ కాలం ఉండగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. దాంతో డిసెంబర్ 9న తన ఎంఎల్‌సి పదవికి రాజీనామా చేశారు. పల్లా రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం కాగా, ఈనెల 27న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. జూన్ 5న ఓట్ల లెక్కింపు జరగనుంది. అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు.

బరిలో 58 మంది అభ్యర్థులు

పట్టభద్రుల ఎంఎల్‌సి బరిలో మొత్తం 58 అభ్యర్థులు ఉండగా, కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కుమార్, బిజెపి నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బిఆర్‌ఎస్ తరఫున ఏనుగుల రాకేశ్‌రెడ్డి పోటీలో ఉండగా స్వతంత్ర అభ్యర్థిగా నిరుద్యోగుల తరఫున పోరాటాలు నడిపిన అశోక్‌కుమార్ బరిలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ ప్రధాన పార్టీల మధ్యే పోటీ జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎంఎల్‌సి స్థానాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్,బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలు పట్టుదలతో ఉన్నాయి. ఈ నెల 27న పోలింగ్ ముగిసే వరకు పూర్తిగా అప్రమత్తంగా ఉంటూ వారితో ఓట్లు వేయించేలా ఆయా పార్టీల అధిష్టానం జాగ్రత్తలు తీసుకుంటోంది. వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఆయా పార్టీలకు ఉన్న బలాబలాలను అంచనా వేసుకుంటూ తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే నేతలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కృషి చేయాలి : సిఎం రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్ పార్టీ ఎంఎల్‌సి అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కృషి చేయాలని మూడు జిల్లాల పార్టీ నేతలకు సిఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. నల్లగొండ, -ఖమ్మం,- వరంగల్ పట్టభద్రుల ఎంఎల్‌సి ఉప ఎన్నికపై సిఎం రేవంత్‌రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. అందుబాటులో ఉన్న మూడు ఉమ్మడి జిల్లాల ముఖ్య నాయకులతో సిఎం సమావేశమయ్యారు. ఎంఎల్‌సి ఉప ఎన్నిక నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో దృష్టి సారించాలని ఆయా జిల్లా నేతలకు సిఎం సూచించారు. మూడు ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 34 ఎంఎల్‌ఎ స్థానాలు ఉండగా అందులో 33 స్థానాల్లో కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు ఉన్నారని, ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో కీలకంగా పనిచేసి ఎంఎల్‌సి స్థానాన్ని కైవసం చేసుకోవాలని సిఎం రేవంత్ వారికి సూచించారు.

నేడు మూడు జిల్లాల బిఆర్‌ఎస్ నేతలతో కెటిఆర్ సమావేశం

పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికపై నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల బిఆర్‌ఎస్ నాయకులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సమావేశం కానున్నారు. తెలంగాణ భవన్‌లో ఉదయం 10.30 గంటలకు కెటిఆర్ ఆయా జిల్లాల నేతలకు సమావేశమై తమ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్ధేశం చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News