Wednesday, December 25, 2024

ఆసిఫాబాద్‌లో ఆదివాసీ ఓట్లే కీలకం

- Advertisement -
- Advertisement -

ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ అసెంబ్లీ ఎన్నికలలో అదివాసీ ఓట్లే కీలకం కానున్నాయి. అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయించేది వారి ఓట్లే కానున్నాయి. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆదివాసీ ఓట్లపైనే ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఎన్నికల బరిలో మొత్తం 17 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా ప్రధానంగా బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యనే తీవ్ర పోటీ నెలకొంది. అధికార పార్టీ బిఆర్‌ఎస్ నుండి జడ్పి చైర్‌పర్సన్, మాజీ ఎమ్మెల్యే కోవలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ నుండి గతంలో జిల్లా రవాణా శాఖ ఆధికారిగా పని చేసిన అజ్మీర శ్యాంనాయక్, భారతీయ జనతా పార్టీ నుండి అత్మరాం నాయక్ పోటీల్లో ఉండగా మరో 13మంది స్వతంత్య్ర అభ్యర్థులు వీరితో పోటీ పడుతున్నారు. గతంలో ఆసిఫాబాద్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషన్ ఉండగా 2009 నుండి ఎస్టీ రిజర్వేషన్ అయింది. దీంతో 2009 లో కాంగ్రెస్ పార్టీ నుండి అత్రం సక్కు, 2014లో బిఆర్‌ఎస్ పార్టీ నుండి కోవలక్ష్మి, 2018 లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ నుండి ఆత్రం సక్కు గెలిచారు.

వీరి ఇద్దరు కూడా గోండు సామాజికవర్గానికి చెందిన వారే కావడంతో ఈ ఎన్నికలలో కూడా వారి ఓట్లే కీలకం కానున్నాయి. ప్రస్తుతం ఆధికార బిఆర్‌ఎస్ పార్టీ నుండి గొండు సామాజీక వర్గం నుండి కోవలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ నుండి లంబాడి సామాజిక వర్గానికి చెందిన అజ్మీర శ్యాంనాయక్‌లు పోటీలో తలపడనున్నారు. నియోజకవర్గంలో మొత్తం 2.26 లక్షల ఓట్లు ఉండగా అందులో గోండు సామాజిక వర్గం ఓట్లు 70వేలకు పైగా, లంబాడి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 25 వేలకు పైగా, బిసి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 1 లక్ష వరకు, ఎస్సీ సామాజిక వర్గం ఓట్లు 20 వేలకు పైగా ఉండడంతో ఈ ఎన్నికలలో గోండు సామాజిక వర్గం ఓట్లు అభ్యర్థుల గెలుపు ఓటములలో కీలకం కానున్నాయి. దీంతో ఇరు ప్రధాన పార్టీల అభ్యర్థులు గోండు సామాజీక ఓట్లపైన ప్రత్యేక దృష్టి సారించారు. వారి కుల పెద్దలతో ప్రతి రోజు సమావేశాలు ఏర్పాటు చేస్తూ తమ పార్టీల అభ్యర్థులకే మద్దతు తెలపాలంటూ ప్రచారం చేస్తున్నారు.

అధికార బిఅర్‌ఎస్ పార్టీ నుండి గోండు సామాజీక వర్గాలకు చెందిన మాజీ ఎమ్మెల్యే , జడ్పిచైర్‌పర్సన్ కోవలక్ష్మి పోటీలో ఉంది. ఈమె అదే సామాజిక వర్గం కావడంతో వారితో మమేకమవుతు ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తుంది. ఇప్పటికే సీఎం కేసిఅర్ ప్రజా అశీర్వద సభలో పాల్గొని కార్యకర్తల్లో జోష్ నింపారు. బిఅర్‌ఎస్ పార్టీ ద్వారానే అదివాసిలకు పోడు పట్టాలు ఇచ్చామని, ప్రచార సభలో ప్రసంగించారు. బిఅర్‌ఎస్ పార్టీ అభ్యర్థి గతంలో అమె చేసిన పనులను, ప్రభుత్వ సంక్షేమ పథకాలను, బిఆర్‌ఎస్ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో దూసుకు పోతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి గతంలో జిల్లా రవాణా శాఖ ఆధికారిగా పని చేసిన అజ్మీర శ్యాంనాయక్ పోటీలో ఉండడంతో ఇతనికి జిల్లాలో మంచి పరిచయాలుఉన్నాయి. అలాగే గతంలో 2018 లో కాంగ్రేస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా అత్రం సక్కు గెలుపోందడంతో ఆ పార్టీకి మంచి బలమైన పట్టు ఉంది. నాలుగు రోజుల క్రీతం ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియంకగాంధి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు.

గతంలో కాంగ్రేస్ ప్రభుత్వం హయాంలో ఆదివాసీల అభివృద్ధి కోసం ట్రైబల్ వెల్ఫర్ ఏర్పాటు చేశామని సభలో ప్రసంగించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను , కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ అందరిని కలుపుకొని ప్రచారంలో దూసుకుపోతున్నారు. బిజెపి పార్టీ నుండి అత్మరాం నాయక్ పోటీలో ఉండి ప్రచారం చేస్తున్నారు. కాని ఇక్కడ బిజెపికి బలమైన క్యాడర్ లేకపోవడంతో కేవలం పార్టీ ఓట్లపైనే అధారపడి ఉన్నారు. దీంతో ఆసిఫాబాద్ నియోజకవర్గంలో బిఅర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మద్యనే ప్రధాన పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News