కోల్‌కతా: లోక్‌సభ 2024 ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ బుధవారం కోరారు. ఆమె టిఎంసి చీఫ్‌గా తిరిగి ఎన్నికైన సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఈ కోరికను వ్యక్తం చేశారు. “ 2024లో బిజెపిని ఓడించేందుకు అన్ని ప్రాంతీయ పార్టీలు ఒక్కటి కావాలి. అందరూ ఒక్కటి కావాలి. మా నినాదం బిజెపిని ఓడించండి అన్నదే. పశ్చిమ బెంగాల్‌లో సిపిఐ(ఎం)ను మేము జాతీయ స్థాయిలో బిజెపిని ఓడిస్తాము” అన్నారు. మేఘాలయ, చండీగఢ్‌లలో బిజెపి గెలవడానికి కాంగ్రెసే సహకరించినట్లు ఆమె ఆరోపించారు. “ బిజెపిని వ్యతిరేకించేవారంతా ఒకే వేదిక మీదికి రావాలి. అహం కలిగిన వారు కొందరు వెనుకే ఉండిపోవాలనుకుంటున్నారు. అందుకు మేము నిందించము. అవసరమైతే మేము ఒంటరిగానే బిజెపితో తలపడతాము” అని ఆమె స్పష్ట చేశారు.
మేఘాలయలో అత్యధిక కాంగ్రెస్ ఎంఎల్‌ఏలు టిఎంసిలో చేరారు. దాంతో అక్కడ టిఎంసి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. చండీగఢ్‌లో కాంగ్రెస్ కౌన్సిలర్లు ఓటింగ్‌కు గైర్‌హాజరయినందున బిజెపి అక్కడ మేయర్ పదవిని కూడా దక్కించుకుంది. చాలా వరకు సీట్లు ‘ఆప్’ పార్టీ గెలుచుకోవడం వల్ల అక్కడ హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. ఇదిలావుండగా కేంద్ర బడ్జెట్‌ను మమతా బెనర్జీ ‘పెద్ద మోసం’ (బిగ్ బ్లఫ్) అని, అది జనాన్ని మోసగించిందని పేర్కొన్నారు. “ ఈ దేశంలో ఇద్దరు వ్యక్తులే భారత భవితతో ఆడుకుంటున్నారు. మరోవైపు దేశ ప్రజలు ఉద్యోగాలు, ఆహారం కోసం గింజుకుంటున్నారు. వారేమి వజ్రాలు కోరుకోవడంలేదు” అని మమతా విమర్శించారు.