Sunday, January 19, 2025

తెలంగాణనే గెలుస్తుంది

- Advertisement -
- Advertisement -

తెలంగాణ మీద దండయాత్రలా ఉత్తరాది నాయకులు పెద్దఎత్తున తెలంగాణలో మకాం వేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, నడ్డాతో పాటు బిజెపి ప్రముఖ నాయకులంతా తెలంగాణలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కుటుంబ పాలన అంటూ గాంధీ కుటుంబం అంతా తెలంగాణలో ప్రచారం చేస్తోందో. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సుడిగాలి పర్యటనలు జరుపుతున్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేరుగా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోగా, ఈసారి ఒక్క సీటు కూడా తీసుకోకుండా టిడిపి కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది. ఖమ్మం జిల్లాల్లో ప్రియాంక గాంధీ పర్యటిస్తే కాంగ్రెస్ జెండాల కన్నా టిడిపి జెండాలే ఎక్కువగా ఉన్నాయి. మొదటి నుంచి టిడిపి అండగా నిలిచిన సామాజిక వర్గం ఈసారి కాంగ్రెస్ ప్రచారాన్ని తమ భుజాన మోస్తుంది. తమిళనాడులో వలే రెండు ప్రాంతీయ పార్టీలు వున్నప్పుడు రెండు పార్టీల మధ్య ఐదేళ్లకోసారి అధికారం మారుతుంటుంది. దాని వల్ల తమిళనాడుకు వచ్చిన నష్టం ఏమీ లేదు. తమిళనాడులో ఏ ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉన్నా తమిళనాడు ప్రయోజనానికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. తమ రాష్ట్ర ప్రయోజనాల తరువాతనే ఇతర రాజకీయాలు వారికి ముఖ్యం.

అందుకే ఆ రాష్ట్రంలోని రెండు పార్టీలు కాంగ్రెస్, బిజెపి ఎవరు అధికారంలో ఉన్నా వారితో కలిసిన చరిత్ర రెండు పార్టీలకు ఉంది. తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ సాధించిన ప్రాంతీయ పార్టీ రెండు జాతీయ పార్టీలతో పోరాడుతోందో. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చి ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయాలి అని నిర్ణయించుకున్నా ఆ పార్టీ ప్రభావం ఎక్కువగా తెలంగాణలోనే. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో సైతం పోటీపడేది రెండు ప్రాంతీయ పార్టీలే. వైయస్‌ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం రెండు ప్రాంతీయ పార్టీలు ఆ రెండు పార్టీలకు తమ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్రంలో అధికారంలో ఉన్నది బిఆర్‌యస్ ప్రాంతీయ పార్టీ కాగా, రెండు జాతీయ పార్టీలు తెలంగాణపై పెత్తనం కోసం ముప్పేట దాడి జరుపుతున్నాయి.వీటికి తోడు ఆంధ్ర కేంద్రంగా పని చేసే టిడిపి సైతం మొదటి నుంచి తెలంగాణ ఒక విఫల రాష్ట్రంగా నిలబెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. తెలంగాణ రాష్ట్ర సమితి 63 సీట్లతో స్వల్ప మెజారిటీతో తొలిసారి అధికారంలోకి రాగానే ఓటుకు నోటు ద్వారా ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నిస్తూ కెమెరాల సాక్షిగా దొరికిపోయారు. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు తెలంగాణను అస్థిర పరచాలి అని పన్నిన ఓటుకు నోటు కుట్ర. ఒక రకంగా తెలంగాణకు మేలే చేసింది.

ఓటుకు నోటు తరువాత పదేళ్ల ఉమ్మడి రాజధానిని వదిలి చంద్రబాబు రాత్రికి రాత్రి అమరావతి వెళ్లిపోయారు. అలా కాకుండా పదేళ్ల ఉమ్మడి రాజధాని అని బాబు కూడా హైదరాబాద్ నుంచే పాలన సాగించి ఉంటే తెలంగాణకు ప్రతి రోజూ తలనొప్పులు తప్పేవి కాదు. హైదరాబాద్ మీద అధికారం వదులుకోవడానికి ఇంత కాలం అయినా బాబుకు మనసు ఒప్పదం లేదు. 2014లో బిసి సిఎం ను చేస్తామని నినాదం. 2018లో కాంగ్రెస్‌తో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసి అధికారంలోకి రావాలి అని ప్రయత్నం. అన్ని ప్రయత్నాలు విఫలం అయ్యాక ఇప్పుడు కాంగ్రెస్ గెలుపు కోసం టిడిపి తెలంగాణలో కృషి చేస్తోంది. కాంగ్రెస్ మీటింగ్స్‌లో టిడిపి జెండాల హడావుడి కనిపిస్తోంది. ఒక వైపు టిడిపి తెలంగాణపై కక్ష గట్టినట్టు వ్యవహరిస్తే తామేమి తక్కువ తినలేదు అని బిజెపి తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేట్టు ప్రయత్నించింది. ఒకవైపు శాసన సభ్యులను కొనేందుకు ప్రయత్నించి పట్టుపడడమే కాకుండా కేసును రాష్ట్రం నుంచి బదలాయించారు. అనేక రాష్ట్రాల్లో శాసన సభ్యులతో బేరాలు సాగించి ప్రభుత్వాలను పడగొట్టిన బిజెపి తెలంగాణ ప్రభుత్వాన్ని, ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించి విఫలమైంది. అయితే ఈ ప్రయత్నాలు నిలిపివేశారు అని అనుకోలేం. చంద్రబాబు అయినా, బిజెపి అయినా ఏదో ఒక రూపంలో ఈ ప్రయత్నాలు సాగిస్తూనే వున్నాయి.

ఉమ్మడి రాజధాని గడువు చివరి దశలో ఉంది. రెండు రాష్ట్రాల మధ్య జలాల వాటా ఇంకా తేలలేదు . మరో వైపు హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అంటూ ప్రచారాలు సాగిస్తూ వున్నారు. పచ్చగా ఉన్న తెలంగాణను వదులుకోవడానికి శక్తులు ఇష్టపడడం లేదు. ఎలాగైనా తెలంగాణను తమ గుప్పిట్లో పెట్టుకోవాలనే ప్రయత్నాలు సాగిస్తున్నారు.ఐటిలో హైదరాబాద్ బెంగళూరును దాటిపోతే, తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు బెంగళూరు నుంచి ఉప ముఖ్యమంత్రి శివకుమార్ హైదరాబాద్‌లో మకాంవేసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తానంటున్నారు. పొరుగు రాష్ట్రం పార్టీతో పాటు జాతీయ పార్టీలు అన్ని వైపుల నుంచి తెలంగాణపై దాడి చేస్తుంటే బిఆర్‌యస్ ఒంటరి పోరాటం సాగిస్తుంది. పదేళ్లలో సాధించిన ప్రగతి, సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులు, తెలంగాణ వాదం బిఆర్‌యస్ అమ్ముల పొదిలోని ఆయుధాలు. వ్యవసాయ రంగంలో, రైతుల పరిస్థితిలో పదేళ్లకు ముందు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది అని ఉత్తరాది నుంచి వస్తున్నా నాయకులకు తెలియకపోవచ్చు. కానీ తెలంగాణ ప్రజలకు తెలుసు. కొన్ని ప్రాంతాల్లో శాసన సభ్యులపై కొంత వ్యతిరేకత తప్ప పాలనపై వ్యతిరేకత లేదు.

మొదటి సారి 63 సీట్లు గెలిచి ఐదేళ్ల పాలన ద్వారా 88 సీట్లు గెలిచిన బిఆర్‌యస్ మూడోసారి గెలిచి చరిత్ర సృష్టించే అవకాశాలే ఎక్కువగా వున్నాయి. తెలంగాణ సంపూర్ణ అభివృద్ధికి తెలంగాణ గెలవాలి, గెలుస్తుంది. ఇంట్లో ఎలుకలు వున్నాయని ఇంటిని తగులబెట్టుకునేవారు ఉండరు. పోరాడి సాధించుకున్న తెలంగాణను జాతీయ పార్టీల చేతిలో పెట్టి మళ్ళీ ఢిల్లీకి గులాంలుగా ఉండాలని ప్రజలు కోరుకోరు.తప్పులు ఉంటే ఉండొచ్చు మన ఇంటిని మనమే సర్దుకోవాలి. తప్పులు వుంటే దిద్దుకోవాలి. ఉమ్మడి రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు లేని రోజు లేకుండే… విద్యుత్ కోతలు చివరకు మంచినీళ్లకు సైతం నోచుకోని పరిస్థితి. ఈ పదేళ్లలో ఈ ప్రధాన సమస్యలు అన్నీ కనిపించకుండా పోయాయి. వ్యవసాయం నుంచి ఐటి వరకు అన్ని రంగాల్లో, సంక్షేమ పథకాల్లో ఈ పదేళ్ల కాలంలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని ఎవరూ కాదనలేరు. సామాజిక వర్గం, మతం పేరుతో రకరకాల పార్టీల వాదనలు వినిపించవచ్చు కానీ తెలంగాణ అభివృద్ధిని కోరుకునే తెలంగాణ వాదులు తెలంగాణనే విజయం సాధించాలి అని కోరుకుంటారు.. తెలంగాణ విజయం సాధిస్తుంది.గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద వయసు వారిని ఏ పార్టీకి ఓటు వేస్తావు అని మీడియా అడిగితే తెలంగాణకు అని చెబుతారు. వాళ్ళ దృష్టిలో తెలంగాణను పాలిస్తున్న పార్టీ, తెలంగాణ రెండు వేరు వేరు కాదు రెండూ ఒకటే. వారి దృష్టిలో తెరాస తెలంగాణ ఆత్మ .. –

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News