ముంబై: ఇతర కులాలకు చెందిన రిజర్వేషన్ కోటా దెబ్బతినకుండా మరాఠా ప్రజలకు రిజర్వేషన్ కల్పించాలని బుధవారం మహారాష్ట్రలో జరిగిన అఖిల పక్ష సమావేశం మరోసారి ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. మరాఠా రిజర్వేషన్ల కోసం ఆమరణ దీక్ష సాగిస్తున్న జాల్నాకు చెందిన హక్కుల కార్యకర్త మనోజ్ జరంగే పాటిల్‌ను తన దీక్షను ఉపసంహరించుకోవలసిందిగా కూడా అఖిలపక్ష సమావేశం విజ్ఞప్తి చేసింది. హింసాకాండ, దహనకాండ కారణంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో దిగజారిన శాంతి భద్రతల పరిస్థితిపై సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది.
మరాఠా ప్రజలకు రిజర్వేషన్ కల్పించాలని సమావేశం తీర్మానించినట్లు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే విలేకరులకు తెలిపారు. ఇతర కులాలలకు చెందిన రిజర్వేషన్లు దెబ్బతినకుండా చూడాల్సిన అవసరం ఉందని సమావేశంలో నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. దీనికి కొంత సమయం పడుతుందని, అంతవరకు అందరూ సహనం పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. ముంబైలోని మలబార్ హిల్‌లోగల సహ్యాద్రి గెస్ట్ హౌస్‌లో జరిగిన అఖిల పక్ష సమావేశానికి ముఖ్యమంత్రి షిండే అధ్యక్షత వహించారు. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్‌సిపి అధినేత శరద్ పవార్, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.