Friday, November 22, 2024

ప్రత్యేక పార్లమెంట్‌కు నేడు అఖిల పక్ష భేటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి ఆరంభం అవుతున్న దశలో ఆదివారం సాయంత్రం అఖిలపక్ష సమావేశం జరుగనుంది. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరఫున పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ ఆహ్వానాలు పంపించారు. ఐదురోజుల పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సంబంధిత అజెండాను ఆలస్యంగా అయినా కేంద్రం వెలువరించింది. దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాలపై విశ్లేషణకు, పెండింగ్ బిల్లుల ఆమోదానికి ఈ సెషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. అయితే ఈ ఐదురోజుల అనూహ్య సెషన్‌లో ప్రభుత్వం కొన్ని విస్మయకర , కీలక విషయాల నిర్ణయాలు తెలియచేస్తుందని విపక్షాలు భావిస్తున్నాయి. ప్రస్తుతానికి కేంద్రం మొక్కుబడిగా అజెండా ప్రకటించి ఉన్నప్పటికీ , మోడీ , అమిత్ షాల ద్వయం మదిలోని ప్రత్యేక అజెండా సెషన్ దశలో వెలుగులోకి వస్తుందని ,

ఎన్‌డిఎ ప్రాబల్యానికి, ప్రతిపక్ష కూటమి ఇండియా విస్తృతికి గండికొట్టేందుకు ప్రభుత్వం ఈ దశలో కొన్ని నిర్ణయాలు తీసుకుని విపక్షాలను ఇరుకున పెడుతుందనే కొన్ని పార్టీల నేతలు తెలియచేస్తున్నారు. ప్రత్యేక సెషన్‌కు అసాధారణ సమయం ఖరారు చేశారు. సోమవారం నుంచి దేశంలో పలు ప్రాంతాలలో గణేష్ చవితి ఉత్సవాలు ఆరంభం అవుతాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక సెషన్‌ను ఏకపక్ష రీతిలో ప్రకటించారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. పార్లమెంట్ ఏర్పాటు అయిననాటి నుంచి ఇప్పటివరకూ 75 సంవత్సరాల కాలంలో జరిగిన ప్రస్థానంపై సెషన్‌లో చర్చ జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. సంవిధాన్ సభ ( కానిస్టూయెంట్ అసెంబ్లీ) గురించే వజ్రోత్సవ దశలో పలువురి అభిప్రాయాల వ్యక్తీకరణ ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.

అజెండాలో లేని అంశాలూ తీసుకురావచ్చు
ప్రభుత్వం వెలువరించిన అజెండాలో లేని అంశాలు, కొన్ని సంచలనాత్మక చట్టాలను తీసుకువచ్చేందుకు ప్రవేశపెట్టే బిల్లుల ప్రస్తావన ఉంటుందని భావిస్తున్నారు. ఈ మేరకు అజెండాకు అతీతంగా వ్యవహరించే అధికారం, కొన్ని బిల్లులను తీసుకువచ్చే నిర్ణయాత్మక బలం ప్రభుత్వానికి ఉంది. అయితే కొత్త బిల్లుల ప్రస్తావన ఉంటుందని అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. అయితే లోక్‌సభ, అసెంబ్లీలో మహిళకు కోటా సంబంధిత చిరకాల బిల్లును తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేసిందని వార్తలు వెలువడ్డాయి. కాగా పాత పార్లమెంట్ భవనంలోనే సెషన్ ఆరంభమవుతుంది. కానీ గణేష్ చవితి సందర్భంగానే కొత్త పార్లమెంట్‌లోకి సెషన్ మారుస్తారని అనధికార వర్గాలు తెలిపాయి. సంబంధిత మార్పును సూచిస్తూ ఇప్పటికే పార్లమెంటరీ సిబ్బంది యూనిఫారంలను మార్చారు. యూనిఫాంలపై కమలం బొమ్మను ముద్రించడం విపక్షాల విమర్శలకు దారితీసింది. దేశంలో జమిలి ఎన్నికలు,

పౌరస్మృతి వంటి విషయాలు ప్రస్తావనకు వస్తాయని నిర్థారణ కాని రీతిలో వెల్లడైంది. కాగా అధికార పక్షాలు విశేషరీతిలో జి 20 సదస్సు ప్రధాని మోడీ సారధ్యంలో ఇండియాలో విజయవంతం అయిందని, పలు కీలక విషయాలలో విభిన్న ధృవాల మధ్య ఏకాభిప్య్ర సాధనకు దారితీసిందని ప్రచారం చేసేందుకు ఈ సెషన్‌ను బాగా వినియోగించుకుంటాయని వెల్లడైంది. ఇక ఇటీవలి కాలంలో ప్రతిపక్షాలు ఇండియా కూటమిగా అవతరించి పలు దఫాల భేటీలు, సమన్వయ సంఘాల ఏర్పాట్లతో ముందుకు వెళ్లుతున్న దశలో ఏర్పాటు అయిన స్పెషల్ పార్లమెంట్ పట్ల రాజకీయ ఆసక్తి ఇనుమడించింది. ముందుగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి దీనిని స్పెషల్ సెషన్‌గా పేర్కొన్నారు. అయితే తరువాతి క్రమంలో ప్రభుత్వం నుంచి వెలువడ్డ అధికారిక ప్రకటనలో ఇది రెగ్యులర్ సెషన్ అని ఉటంకించారు. ప్రస్తుత లోక్‌సభ 13వ సెషన్, రాజ్యసభ 261 సమావేశాలు అని తెలిపారు. నవంబర్‌లో శీతాకాల పార్లమెంట్ సెషన్ ఉండనే ఉంటుంది.

ఇప్పుడు అర్థాంతరంగా హడావిడిగా ఈ సెషన్ అవసరం ఏమొచ్చిందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పందించారు. ముందు స్పెషల్ సెషన్ అన్నారు, అజెండాపై ఉత్కంఠ పెంచారు. తరువాత విశేషం ఏదీ లేదనే రీతిలో షెడ్యూల్ వెలువరించారని , తమకైతే ప్రభుత్వం నుంచి కొన్ని అత్యంత కీలకమైన లెజిస్లేటివ్ గ్రైనైడ్స్ మెరుపుదాడులు ఉంటాయనే అనుమానం వస్తోందని స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News